- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోసారి కాంగ్రెస్‌లో కల్లోలం.. మొన్న మిర్యాలగూడ.. నేడు సూర్యాపేట..
దిశ, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు కొంతమంది లీడర్లు.. వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. భారత్ జోడో యాత్ర, హాథ్ సే హాథ్ యాత్రల పేరుతో కార్యకర్తల్ని ఏకం చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుంటే.. కొంతమంది లీడర్లు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం పొట్లాటకు దిగుతుండడం క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్ని కలవరపాటుకు గురి చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా చెప్పుకునే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కో నేతదీ.. ఒక్కో తీరుగా మారింది. తాజాగా హాథ్ సే హాథ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో అడపాదడపా పార్టీ కార్యక్రమాలు చేపడుతుండగా, ఇదే సమయంలో లీడర్లు అవే వేదికలుగా ఘర్షణలకు దిగుతుండడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రేవంత్ వర్సెస్ సీనియర్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజూకీ రాజుకుంటోంది. ఇప్పటివరకు సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య ఉండే వర్గపోరు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్ లీడర్ల వర్గంగా మారింది. తాజాగా చేపట్టిన హాథ్ సే హాథ్ కార్యక్రమంలోనూ ఆ విషయం తేటతెల్లమయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి వర్గీయులుగా భావిస్తున్న కాంగ్రెస్ నేతలేవ్వరినీ మాణిక్ రావు ఠాక్రే సమావేశానికి ఆహ్వానించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్, బత్తుల లక్ష్మారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి తదితర నేతలేవ్వరికీ ఆహ్వానం అందలేదు. అయితే కోదాడలో నిర్వహించిన ఈ సమావేశానికి పటేల్ రమేష్ రెడ్డి వెళ్లడం.. ఆయనే టార్గెట్‌గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శలు గుప్పించడంతో ఒక్కసారిగా పరిస్థితి గందరగోళంగా మారింది. పటేల్ వర్గీయులు సమావేశం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం.. ఉత్తమ్ తదితర నేతలు సర్ది చెప్పడం చకచకా జరిగిపోయాయి.
వర్గపోరే ప్రధాన కారణం..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచీ గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనైతే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లా అంతటా వర్గపోరు కుంపటే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కొత్తగా రేవంత్ రెడ్డి వర్గం.. ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం సంగతి పక్కనపెడితే.. సొంత పార్టీ నేతల కుమ్ములాటల వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. నిజానికి ఉమ్మడి జిల్లాలో ఎప్పట్నుంచే వర్గపోరు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక మాత్రం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్గపోరు కాస్తంత ఎక్కువయ్యింది. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మరింతగా ఆజ్యం పోసినట్టు అయ్యేవి.
మొన్న మిర్యాలగూడ.. నేడు సూర్యాపేట..
ఇటీవల మిర్యాలగూడ కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకానొకదశలో ఇరువర్గాలు భౌతిక దాడులకు సైతం దిగాయి. అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కాస్త బహిర్గతమయ్యింది. అయితే దీనిపై పార్టీ అధిష్టానం గానీ కాంగ్రెస్ పెద్దలు కానీ స్పందించలేదు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఎదుట మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి వర్గీయులు రచ్చ రచ్చ చేయడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం మర్చిపోయి లీడర్లు.. వాగ్వాదానికి దిగుతుండడంపై క్షేత్రస్థాయి కాంగ్రెస్ క్యాడర్ భగ్గుమంటోంది.