Negligence in Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం..బాబు పుడితే..వాళ్లు చేసిన పని ఇది..

by Naveena |   ( Updated:2024-10-30 12:27:43.0  )
Negligence in Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం..బాబు పుడితే..వాళ్లు చేసిన పని ఇది..
X

దిశ, రాజాపేట : రాజపేట మండల కేంద్రంలోని 24 గంటల మహిళా ఆరోగ్య కేంద్రం పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. బుధవారం బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన ధర్మ శైలజ కిరణ్ దంపతులకు మొదటగా కుమారుడు జన్మించగా.. రెండవ కాన్పు కోసం కుటుంబ సభ్యుల సూచన మేరకు, ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకంతో గజ్వేల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కోసం చేరింది. ధర్మశైలజ ఈనెల అక్టోబర్ 14వ, తేదీన రాత్రి 11:27 నిమిషాలకు శిశువుకు జన్మనిచ్చింది. జనన ధ్రువీకరణ పత్రం కోసం తల్లిదండ్రులు అడగాగ.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్ లైన్ లో నమోదు కాకపోగా.. రాజపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు ధర్మ శైలజ అంతకుముందే సెప్టెంబర్ 23వ,తేదీన 4 : 51 సమయానికి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రాజపేట సిబ్బంది ఆన్ లైన్ లో తప్పుగా నమోదు చేసినట్లు బయటపడింది. ఈ విషయంపై ఆందోళన చెందిన ధర్మశైలజ కిరణ్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వారాల ముందే రాజపేట ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు ఎలా తప్పుడు ధృవీకరణ చేస్తారని తమకు కొడుకు పుడితే..కూతురు పుట్టిందని గజ్వేల్ ఆస్పత్రిలో డెలివరీ అయితే రాజపేట ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు ఎలా ధ్రువీకరిస్తారని ప్రశ్నించారు. న్యాయం చేయాలని కోరినప్పటికీ 15 రోజులుగా ఏవో కారణాలు చెబుతూ.. కాలయాపన చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గజ్వేల్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనివ్వగా.. 21 రోజుల ముందే రాజపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల పుట్టినట్లు కంప్యూటర్ నమోదు చేయడం, తమ జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయమని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై రాజపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని వివరాలు కోరగా ..15 రోజులుగా తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తప్పుడు ఐడి నమోదు తోనే వేరే గర్భిణీ స్త్రీ పేరుకు బదులు ధర్మ శైలజ పేరు కంప్యూటర్లో నమోదు అయినట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కానుందని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న బాధ్యులపై, పర్యవేక్షణ పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story