Nagarjuna sagar : నాగార్జునసాగర్‌ 16.రేడియల్‌ క్రస్టు గేట్లు ఎత్తివేత..

by Sumithra |
Nagarjuna sagar :  నాగార్జునసాగర్‌ 16.రేడియల్‌ క్రస్టు గేట్లు ఎత్తివేత..
X

దిశ, నాగర్జునసాగర్ : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పెద్దఎత్తున వరద పోటెత్తడంతో నాగర్జునసాగర్ నిండుకుండలా మారింది. గతేడాది నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన నాగర్జున సాగర్, ఈ సారీ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెల్లని పాలధారలా పులిచింతల ప్రాజెక్టుకు పరుగులు పెడుతోంది. నాగార్జునసాగర్ డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తిన క్రమంలో తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరెన్ మోగించారు. అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర్ రావు ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర్ రావు క్రస్ట్‌గేట్ల స్విచ్ ఆన్ చేసి గేట్లు తెరిచారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు సోమవారం 11 గంటలకు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ముందుగా 2 గేట్లను, తర్వాత ఆరు గేట్లు తెరిచారు. సాయంత్రం కల్లా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో 16 గేట్లను 5 ఫీట్ల మేరకు ఎత్తి అధికారులు నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. క్రమంగా గేట్లను ఎత్తుతున్నారు.

నాగార్జునసాగర్ నీటి సమాచారం..

పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 583.80 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 293.9736 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,110 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 8452 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 4746 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని మొత్తం 1,48,392 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రెండు పంటలకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాయంత్రం వరకు మొత్తం 16 గేట్లను తెరవనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజక్ట్ ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగు కోసం నీటిని వదిలారని, గత సంవత్సరం సాగునీరు లేనందున నీటిని వదలలేదని, ఈసారి సాగునీటిని వదిలినందున ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి సామర్థ్యం ఆధారంగా ఈ సంవత్సరం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించనున్నట్లు తెలిపారు. కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని, ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్నచోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని వదలనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చెరువులన్నీ నింపుతామన్నారు. ఆయకట్టు రైతులందరూ సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. నాగార్జునసాగర్ క్రెస్ట్ గేట్లను ఎత్తివేసినందున నది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదిలోకి స్థానానికి గాని, ఈతకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నది లోకి వెళ్ళవద్దని పశువులు, గేదెలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. నాగార్జునసాగర్ కు పై నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లు ఎత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుంచి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సాగర్‌లో పర్యాటకుల సందడి..

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో నురగలై.. తరగలై.. ఉప్పొంగి వరదలై ప్రవహిస్తోన్న 'కృష్ణమ్మ' పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సోమవారం నాగార్జునసాగర్ రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తుతారని.. తెలుసుకున్న పర్యాటకులు కృష్ణమ్మ హోయలను చూసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలివచ్చారు. సాగర్‌ అందాలను తిలకించేందుకు ఇక్క డికి వచ్చారు. సాగర్‌లో పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్తవంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేశారు. హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృహం వెనక వైపున ఉన్న నూతన లాంచీ స్టేషన్‌ పర్యాటకులతో లాంచీస్టేషన్‌, బుద్ధవనం, డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర దళాల ఆధీనంలో..

సాగర్‌ ప్రధాన డ్యాం పై ఎడమ వైపున తెలంగాణ సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, కుడి వైపున ఏపీ సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత కొనసాగుతోంది. కంట్రోల్‌ రూం వద్ద కూడా సీఆర్‌పీఎఫ్‌ బలగాలే పహారా కాస్తున్నాయి. ఎస్పీఎఫ్‌ బలగాలు కేవలం ఎడమ ఎర్త్‌ డ్యాం, గ్యాలరీలు, ఎడమ కాల్వ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయి

Advertisement

Next Story

Most Viewed