అడుగంటిన సాగరం.. అన్నదాతకు నిరాశే

by srinivas |
అడుగంటిన సాగరం.. అన్నదాతకు నిరాశే
X

తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది. ప్రమాదకరస్థాయిలో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్‌ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నిండుకుంటోంది. కృష్ణా ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 503.90 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 121.54 టీఎంసీలు ఉంది. వానాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా నేటికీ భారీ వర్షాల జాడ లేదు. దీంతో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి నీరు రాక వెలవెలబోతున్నాయి. అంతేగాక డెడ్‌ స్టోరేజీలో ఉండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వానాకాలం పంటలపై ఈ ఏడాది పెను ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు.

- దిశ, నాగార్జునసాగర్

దిశ, నాగార్జునసాగర్ : తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది. ప్రమాదకర స్థాయి డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్‌ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నిండుకుంటోంది. దీంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించింది. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కృష్ణ ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 503.90 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 121.54 టీఎంసీలుగా ఉంది. వానాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా నేటికీ భారీ వర్షాల జాడ లేదు. దీంతో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి నీరు రాక వెలవెలబోతున్నాయి. అంతేగాక డెడ్‌ స్టోరేజీలో ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానాకాలం పంటలపై ఈ ఏడాది పెను ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు.

తగ్గుముఖం పట్టిన నీరు...

నాగార్జున సాగర్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా సాగర్‌లోకి నీరు రావడం లేదు. కృష్ణా బేసిన్‌లో ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌కు నీరు వచ్చింది లేదు. నాగార్జునసాగర్‌ నీటిసామర్థ్యం 319 టీఎంసీలకు, ప్రస్తుతం కేవలం 121 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీనిని ఇరిగేష‌న్‌ అధికారులు డెడ్‌ స్టోరేజీగా పరిగణిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే అవకాశం లేదని, సాగునీటి విడుదలకు అవకాశాలు లేవ‌ని అధికారులు చెబుతున్నారు.

ఆందోళనలో రైతులు..

రాష్ర్టంలో పోయినేడాది సరిపడా వర్షాలు కురవలేదు. ప్రధానంగా కృష్ణా బేసిన్​లో లోటు వర్షపాతం నమోదు కావడంతో వానాకాలం పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ కింద ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాగులో ఉన్న వరి పంటలకు వారబందీ పద్ధతిలో కెనాల్స్, లిఫ్టుల ద్వారా నీటిని అందించాల్సి వచ్చింది. ఇక యాసంగిలో బోర్లు ఉన్న రైతులే పొలాలు సాగు చేశారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉన్న రైతులు సాగు చేయలేదు. కెనాల్స్, లిఫ్టుల పరిధిలో యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఇక ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు ప్రాజెక్టులకు వరద రాలేదు. దీంతో వరిసాగు చేయాలనుకునే రైతులు అమోమయంలో పడ్డారు. ఈ ప్రాజెక్టుల కింద 36లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఇందులో ప్రధానంగా వరి సాగు చేస్తున్నారు. సీజన్​ ప్రారంభం కావడంతో వరి నార్లు పోసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. వర్షాలు పడతాయా? పడకుంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రాజెక్టులకు వరద వస్తే వానాకాలం పంటలకు సాగునీటిని విడుదల చేస్తారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు.

తాగునీటికీ ఇబ్బందులు..

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతూ వచ్చాయి. ఎండలు కూడా విపరీతంగా కొట్టడంతో ఏప్రిల్​లోనే డెడ్​ స్టోరేజీకి చేరాయి. దీంతో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కర్నాటక సర్కార్‌తో మాట్లాడి అక్కడి ప్రాజెక్టు నుంచి మే నెలలో ఒకటిన్నర టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయించుకుంది. దీంతో తాగునీటికి కొంత ఇబ్బంది తప్పింది. అయితే ఈసారి ప్రాజెక్టులు నిండకుంటే తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఐదేళ్లుగా ఆయకట్టుకు నీటి విడుదల ఇలా..

సంవత్సరం నీటి విడుదల తేదీ నాటి నీటి మట్టం

2018-19 24-08-2018 562 అడుగులు (238.47టీఎంసీలు)

2019-20 12-08-2019 556 అడుగులు (223.19టీఎంసీలు)

2020-21 08-08-2020 587 అడుగులు (305.62 టీఎంసీలు)

2021-22 02-08-2021 587 అడుగులు (305.62 టీఎంసీలు)

2022-23 29-07-2022 552 అడుగులు (215.98 టీఎంసీలు)

పుట్టంగండి వద్ద జీరో లెవల్‌ పంపింగ్‌...

హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీటి సరఫరాను ప్రస్తుతం పుట్టంగండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతోంది. 510అడుగుల డెడ్‌ స్టోరీకి దిగవకు నీటిమట్టం పడిపోతే పంపింగ్‌ కష్టం అవుతుంది. నీటి మట్టం 510అడుగుల దిగువనకు చేరినప్పుడు బ్యాక్‌ వాటర్‌ వద్ద జీరో పాయింట్‌ నుంచి డ్రెడ్జింగ్‌ ప్రక్రియతో భారీ మోటార్లతో పంపింగ్‌ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు రూ.1450కోట్లతో సుంకిశాల వద్ద మూడోదశ పైపు లైన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసర పనులను చేపడుతున్నారు.

కనిష్ట స్థాయికి నీటి మట్టం...

ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్​లో అట్టడుగున ఉండే రాళ్లు, రప్పలు బయటకు తేలాయి. సాగర్​ గరిష్ట నీటి మట్టం 590అడుగులు కాగా, ప్రస్తుతం 503 అడుగులకు పడిపోయింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు కాగా.. కనిష్ట నిల్వ 213 టీఎంసీలు. వానలు లేకపోవడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్కనీరు రాకపోవడంతో రిజర్వాయర్ ​నీరు మండుటెండలకు ఆవిరవుతోంది. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం.. సాగర్​ రిజర్వాయర్​లో 503.80అడుగుల మేర 112.033 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుల్లో 528.30అడుగులతో 164 టీఎంసీల నీరు ఉంది. గతేడాదితో పోలిస్తే సాగర్​లో 35 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. డెడ్​స్టోరేజీ 510 అడుగులు కాగా, అంతకంటే ఆరు అడుగుల దిగువకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రిజర్వాయర్​ పరిధిలోని కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 22లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారడంతో నార్లు పోసుకునేందుకు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాగునీటి అవసరాలకే.. రిజర్వాయర్​లో ఇప్పుడున్న నీళ్లు వచ్చే రెండు నెలల అవసరాలకే సరిపోతాయి. 490అడుగుల వరకు మోటార్ల సాయంతో తాగునీటి అవసరాలకు నీళ్లు తోడుకోవచ్చు. వానలు పడి, పైనుంచి వరదలు వస్తే తప్ప సాగర్​లోకి నీటి ప్రవాహాలు వచ్చే పరిస్థితి లేదు. సాగర్ నీటి నిల్వలు పడిపోవడంతో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు విపరీతంగా బోర్లు వేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed