అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌ నాగార్జున సాగర్

by Mahesh |
అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌ నాగార్జున సాగర్
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలోని అటవీ ప్రాంతం, పచ్చని వృక్షాలు.. పక్షుల కిలకిల రాగాలు.. జంతువుల అరుపులు.. నెమళ్ల నాట్యాలు. ఉల్లాసంగా గడిపేందుకు సరికొత్త థీమ్‌లతో అర్బన్‌ పార్క్‌ అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కృష్ణమ్మ అందాల వీక్షణం కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అడవిలో నుంచి కృష్ణమ్మ అందాలు చూసేందుకు వ్యూపాయింట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న నాగార్జునసాగర్‌ డివిజన్‌ నుంచి దిగువన ఉన్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారె‌స్ట్‌లో నెల్లికల్‌ బీట్‌లో 250 ఎకరాల్లో రూ.1.5కోట్లతో అర్బన్‌ పార్కును ఏర్పాటు చేసింది.

ట్రిప్పుకు రూ.1,000 నుంచి రూ 1,500 ఛార్జ్

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు గంట చొప్పున సమయం కేటాయించారు. పర్యాటకులు అటవీ అందాలను వీక్షించేందుకు సఫారీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఒక ట్రిప్పులో 8 నుంచి 10 మంది వెళ్లనున్నారు. ఇందుకు 10 కిలోమీటర్ల పరిధికి రూ.1,000 ఛార్జ్ అవుతుండగా 24 కిలో మీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500లు ఛార్జ్ చేస్తున్నారు. అడవిలో వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నాయని పర్యాటకులు పేర్కొన్నారు. రూ.వెయ్యి, 1500 ఒక కుటుంబ సభ్యులు చెల్లించగలిగితే వారికి ప్రత్యేకమైన ట్రిప్పులు పార్క్ గురించి వివరించడానికి అటవీశాఖ గైడును ఏర్పాటు చేస్తున్నారు.

ఆహ్లాదాన్నిచ్చే సాగరతీరం

ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా ప్రాజెక్టులకు వరద నీరుతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తిన అధికారులు దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నిండుకుండలా మారింది. 14 మీటర్ల ఎత్తు, 13 మీటర్ల వెడల్పుతో 26 గేట్లతో రక్షించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కృష్ణా నదిపై నిర్మించబడింది. ఈ ఆనకట్ట దాదాపు 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. ప్రస్తుతం ఈ డ్యామ్ 22 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రస్తుతం ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. వాస్తవానికి, హరిత విప్లవం లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన మొదటి నీటిపారుదల ప్రాజెక్టులలో ఇది ఒకటి. నేడు, ఇది నీటిపారుదల సౌకర్యాన్ని అందించడమే కాకుండా, జలవిద్యుత్‌కు కూడా మూలం. ఈ డ్యామ్ దాని గొప్ప వైభవం, దాని చుట్టూ ఉన్న దట్టమైన పచ్చటి కవచం కారణంగా చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఎత్తిపోతల జలపాతం

పరిపూర్ణ అందం, శ్రేష్ఠత, ఎత్తిపోతల జలపాతం సాగర్ పట్టణం యొక్క మరొక ప్రధాన ఆకర్షణ. ఇది వాస్తవానికి ఒక ప్రసిద్ధ పర్వత ప్రవాహం, ఇది దాదాపు 21.3 మీటర్ల ఎత్తు నుండి మడుగులోకి వస్తుంది. నక్క వాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగు ఈ సుందర జలపాతానికి జన్మనిస్తున్నాయి. అద్భుతమైన దృశ్యాలను అందించే సైట్‌లో మొసళ్ల పెంపకం కేంద్రాన్ని చూసి ఆనందించవచ్చు. ఇక్కడ రంగనాథ, దత్తాత్రేయ అనే రెండు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఈ జలపాతం నాగార్జునసాగర్ డ్యామ్ నుండి దాదాపు 15 మైళ్ల దూరంలో మాచర్లకు వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడే శ్రీశైలం వరకు వెళ్లే కొన్ని గుహలను కూడా కలిగి ఉంది.

వన్యప్రాణుల అభయారణ్యం

ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణులకు స్వర్గం. నాగార్జునసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం శ్రీశైలంలో ఉంది. దీనిని తరచుగా నాగార్జునసాగర్ శ్రీశైలం అభయారణ్యం అని పిలుస్తారు. దాదాపు 3568 చ.కి.మీ విస్తీర్ణంలో ఏర్పడిన ఈ భూమి వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉంది.

నాగార్జునకొండ మ్యూజియం

నాగార్జునకొండ ద్వీపం లో మానవ నిర్మిత నాగార్జునసాగర్ సరస్సు మధ్యలో నాగార్జునకొండ మ్యూజియం ఉంది. ఈ బౌద్ధ మ్యూజియం ఆనకట్ట నిర్మాణ సమయంలో త్రవ్వబడిన వివిధ బౌద్ధ నిర్మాణాలు, కళాఖండాల సేకరణతో నిండిపోయింది. 3వ శతాబ్దానికి చెందిన ఈ సేకరణ చాలా పురాతనమైనది. అందమైన సేకరణలో జాతక కథలతో చెక్కబడిన ప్యానెల్లు, బుద్ధుని రాతి విగ్రహాలు, రాతి యుగానికి చెందిన ఆయుధాలు, పరికరాలు, పాత శాసనాలు మొదలైనవి ఉన్నాయి, నాగార్జున కొండ సాగర్ నుండి 23 కి మీ దూరంలో.. బోట్ లాంచ్ స్టేషన్ నుంచి 14 కి మీ దూరంలో ఉంటుంది. ఇది కృష్ణ నదిలో ఉన్న చిన్న ద్వీపం, ఇందులో 2వ శతాబ్దపు బౌద్ధ నాగరికత యొక్క త్రవ్వకాల అవశేషాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సందర్శించవలసిన ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఇది ఒకటిగా నిలిచింది.

నాగార్జునసాగర్ విజయపురి నార్త్ విజయ్ విహార్ నుండి తెలంగాణ టూరిజం నిర్వహిస్తున్న బోట్ లాంచ్ స్టేషన్ నుండి బోట్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. బోట్ టైమింగ్స్: 9.30 AM, 11.30 AM & 1.30 PM, మ్యూజియం టైమింగ్స్: 9 AM నుండి 4 PM. శుక్రవారాలు మరియు జాతీయ సెలవు దినాలలో మూసివేయబడుతుంది. బోట్ ఫీజు: రూ. పెద్దలకు 150 & రూ. 120 పిల్లల కోసం మ్యూజియం ప్రవేశం : రూ. పెద్దలకు 20 & పిల్లలకు రూ. 10 వసూలు చేస్తారు.

పర్యాటక కేంద్రంగా వైజాగ్ కాలనీ..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే కాదు దాని బ్యాక్ వాటర్ కూడా పర్యాటక శోభను సంతరించుకుంటోంది. నాగార్జున సాగర్ అనగానే గేట్ల నుంచి జాలువారే నీటి ప్రవాహం లేదంటే.. జలాశయం మధ్యలో ఉండే నాగార్జున కొండ మాత్రమే అనుకుంటారు చాలా మంది. ఎవరైనా నాగార్జున సాగర్ కు వెళ్లినా గేట్లు ఓపెన్ చేస్తే నీటి ప్రవాహాన్ని లేదంటే.. నీటి మధ్యలో ఉండే ఐలాండ్ ను చూసి వస్తారు. ఈ జాబితాలోకి మరో ప్రాంతం చేరుకుంది. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బ్యాక్ వాటర్ ప్రాంతాన్నే వైజాగ్ కాలనీని తెలంగాణ గోవా కా కూడా పిలుస్తారు. ఇసుక తిన్నెలు, రాళ్లూ, చల్లగా వీచే గాలితో ఈ ప్రాంతం చాలా బాగుంటుంది.

కాసేపు అలా వచ్చి ఇక్కడ సేదతీరేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. క్రమంగా వైజాగ్ కాలనీ కి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల కోసం సమీపంలోనే చేపలు, నాటు కోడి కూర, జొన్న రొట్టెలు కూడా లభిస్తున్నాయి. లేదంటే.. మనమే స్వయంగా వంట చేసుకుని హాయిగా గడపొచ్చు. పచ్చని కొండల నడుమ, గిలిగింతలు పెట్టే చల్లని గాలి, పక్కనే కృష్ణమ్మ ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సాగర్ పర్యాటక కేంద్రాలను వెంటనే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లి ఎంజాయ్ చేయండి.

Advertisement

Next Story