ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న ప్రభుత్వాలు..ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..

by Sumithra |
ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న ప్రభుత్వాలు..ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..
X

దిశ, చిలుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రభుత్వ విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణపురంలో నిర్వహించిన తెలంగాణ పౌరస్పందన వేదిక కార్యక్రమానికి హాజరైన సందర్భంలో 'దిశ'తో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు కేవలం 2.6% నిధులు కేటాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని తాము తెలంగాణ శాసనమండలిలో కోరితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 12% నిధులు మాత్రమే కేటాయించిందని అన్నారు. వైద్య రంగానికి కూడా అరకొర నిధులు కేటాయిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాలయాలకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్లో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్రం 10% నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

'మన ఊరు - మన బడి' పథకం సజావుగా అమలైతే పాఠశాలల్లో కనీస వసతులు మెరుగవుతాయని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఆ పథకంలో మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల్లో 9123 పాఠశాలలను ఎంపిక చేసి పనులు ప్రారంభించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సజావుగా అందించకపోవడంతో ఆ పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కొన్ని పాఠశాలల్లో గుత్తేదారులు పనులు నిలిపి వేశారని నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించి పేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.అలివేలుమంగ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆర్.ధనమూర్తి ఉన్నారు.

Advertisement

Next Story