children selling gang : కి లేడి గ్యాంగ్.. పిల్లలు లేని దంపతులే వారి టార్గెట్...

by Sumithra |
children selling gang : కి లేడి గ్యాంగ్.. పిల్లలు లేని దంపతులే వారి టార్గెట్...
X

దిశ, సూర్యాపేట టౌన్/కలెక్టరేట్ : సంతానం లేని దంపతులే ఆ కి లేడీల టార్గెట్. ఆస్తులు బాగా ఉండి కూడా సంతానం లేక మనోవేదనకు గురౌతున్న వారి వివరాలను ఆ ఇద్దరు మహిళలు ఇరుగుపొరుగు వారి చేత ఆరా తీస్తారు. వారి వివరాలను సేకరించిన తర్వాత నెమ్మదిగా వాళ్లు వేసుకున్న ప్లాన్ ను అమలు చేస్తారు. పిల్లలు లేని కుటుంబ సభ్యులతో ముందుగా తాను ఒకచోట పనిచేస్తున్నానని, గత కొద్దిరోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నానని, మీరు పిల్లలు లేక బాధపడుతున్నారని తెలుసుకొని మీకు మంచి చేయడం కోసమే మీతో మాట్లాడుతున్నానని వారితో మాటలు కలుపుతారు. తమకు తెలిసిన ఒక వ్యక్తి (మహిళ) ఒక ఆసుపత్రిలో పని చేస్తుందని, పిల్లలు కావాలంటే ఆ మహిళ ను కలిస్తే పిల్లలను ఇస్తుందని, పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహిళ చూసుకుంటుందని, ఆ ఆసుపత్రి డాక్టర్లతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ విధంగా మాటాలు కలుపుతారు.

పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆ మహిళ చెప్పే మాటలు పిల్లలు లేని లోటు తీర్చే విధంగా ఉంటాయి. పిల్లలను కొనుగోలు చేస్తునందుకుగాను పిల్లలు లేని దంపతులతో ఆ ఇద్దరు మహిళలు ముందుగా ఒక ధర మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న ధరలో ముందు కొంత భాగం చెల్లించాలని, మిగతా సగం పిల్లల దంపతులకు ఇచ్చిన తర్వాత చెల్లించే విధంగా మాట్లాడుకుంటారు. సగం డబ్బులు చేతిలో పడిన తర్వాత ఈ రోజు మీకు పిల్లల్ని ఇస్తాం, రేపు పిల్లలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి చివరకు ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటారు. ఆ ఇద్దరు మహిళల మాయ మాటలు నమ్మి మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుంటారు పిల్లల లేని దంపతులు. ఇది కథ కాదు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన యదార్థ సంఘటన. దిశ దినపత్రిక లోతుగా వెళ్లి వివరాలు తెలుసుకోవడంతో గుట్టు బయటపడింది.

పిల్లల విక్రయానికి రూ. 4 నాలుగు లక్షలు...

సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ లో ఓ మండలానికి చెందిన ఒక వ్యక్తికి వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా సంతాపం లేదు. దంపతులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, వివిధ పరీక్షలు చేయించుకున్నా సంతానం కలగలేదు. సంతానం లేమితో బాధపడుతున్న ఆ కుటుంబానికి అదే మండలానికి చెందిన ఒక మహిళ సూర్యాపేట ఖమ్మం రోడ్డు సమీపంలో ఒక డబ్బా కొట్టు ఏర్పాటు చేసుకుంది. ఆ కొట్టు మీద జీవనం సాగిస్తుంది. ఆ మహిళకు మరో మహిళ ఇటీవల పరిచయం అయ్యింది. కొట్టు పెట్టుకున్న మహిళకు తెలిసిన వాళ్లు ఎవరైనా పిల్లలు లేకుండా బాధపడితే తనకు తెలపమని, ఒక తండాలో మహిళ ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిందని, కుటుంబాన్ని మోసే స్థితిలో ఆ కుటుంబం లేకపోవడంతో ఆ పిల్లలను ఇతరులకు విక్రయించాలనే ఆలోచనలో ఉందని ఈ కొట్టులో ఉంటున్న మహిళకు ఇటీవల పరిచయం అయిన మహిళ చెప్పింది. దీంతో ఆ కొట్టు నిర్వహించే మహిళకు తన గ్రామంలో పిల్లలు లేక బాధపడుతున్న వ్యక్తి గుర్తుకు వచ్చాడు. ఆ వ్యక్తి సంబంధించిన ఫోన్ నెంబర్ ఆ కొట్టు నిర్వాహకురాలి దగ్గర లేకపోవడం ఆ మండలంలోని రోడ్డు దగ్గర ఒక షాప్ యజమాని ఫోన్ నెంబర్ ఆమె దగ్గర ఉండటంతో ఆ విషయం ఆ షాప్ యజమానికి చెప్పింది. ఆ షాప్ యజమాని ఆ విషయాన్ని పిల్లలు లేని వ్యక్తికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు.

దీంతో పిల్లలు లేని ఆ దంపతులు హుటహుటిన సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఆ కొట్టు మహిళ వద్దకు వచ్చారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని, సూమారుగా రూ. 4 లక్షలు వరకు ఖర్చు అవుతుందని కొట్టు నడుపుతున్న మహిళ తెలిపింది. అంతా డబ్బు తమ దగ్గర లేవని రూ. 2 లక్షల వరకు ఇవ్వగలమని పిల్లలు లేని దంపతులు తెలిపారు. దీంతో ఆ కొట్టు నిర్వాహకురాలు తనకు పరిచయమైన మహిళకు ఈ సమాచారం తెలిపింది. పిల్లలను బయటకు తీసుకురావాలంటే చాల ఖర్చు అవుతుందని, డాక్టర్లకు కూడా కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని చివరకు రూ. రెండు లక్షలు ఇవ్వాలని పిల్లలు లేని దంపతులతో రెండో మహిళ ఫోన్ లో మాట్లాడింది. ముందుగా రూ. లక్షన్నర, పిల్లలను చేతికి ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 50 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.

డబ్బులు ఇచ్చారు కానీ పిల్లలను ఇవ్వలేదు...

ఒప్పందం ప్రకారం పిల్లలు లేని దంపతులు కొట్టు నిర్వహించే మహిళలకు ఈ నెల 25న (శుక్రవారం) రూ. లక్షన్నర ఇచ్చారు. శుక్రవారం సాయంత్రమే పిల్లలు ఇస్తామని ఆ మహిళ పిల్లలు లేని దంపతులకు చెప్పింది. శుక్రవారం సాయంత్రం వరకు ఆ పిల్లలు లేని దంపతులు పిల్లలు తీసుకుపోవడం కోసం ఎదురు చూశారు. అయినా పిల్లలను వారికి ఇవ్వలేదు. కొట్టు నిర్వహించే మహిళను దంపతులు గట్టిగా మందలించడంతో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో పిల్లలు ఉన్నారని మీరు కారును కిరాయి తీసుకొని హైదరాబాద్ కు రావాలని మరో మహిళ కొట్టు నిర్వహించే మహిళకు సూచించింది.

పిల్లల కోసం హైదరాబాద్ కు ప్రయాణం..

పిల్లలని తీసుకోవడం కోసం హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో పిల్లలు అందించే వ్యక్తి మరో పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లాడని, మరో రోజు హైదరాబాద్ కు వచ్చి పిల్లలను తీసుకోవాలని ఆ మహిళ తెలపడంతో పిల్లల కోసం డబ్బులు చెల్లించిన దంపతులకు ఈ ఇద్దరు మహిళల ( డబ్బా కొట్టు మహిళ, మరో మహిళ) పై అనుమానం వచ్చింది. మరుసటి రోజు సూర్యాపేటకు వచ్చిన రెండో మహిళను పిల్లలు లేని దంపతులు గట్టిగా మందలివ్వగా తనకు మహిళ రూ. 75 వేలు మాత్రమే ఇచ్చిందని, మిగతా డబ్బులు తనకు తెలియదని సమాధానం ఇచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ దంపతులు ఇస్త్రీ చేసే మహిళను మందలించారు. దీంతో వారు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చింది.

మరో డ్రామాకు తెర తీసిన రెండో మహిళ..

ఇంత జరిగినా ఆ పిల్లలు లేని దంపతులు జరుగుతున్న మోసం గమనించకుండా తాను మీకు పిల్లలు ఇస్తానని, సూర్యాపేటలోని ఒక ఆసుపత్రిలో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, ఆతడి ద్వారా మీకు పిల్లలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో ఆ రెండో మహిళకు పిల్లలు లేని దంపతులు రూ.96 వేలు చెల్లించారు. డబ్బులు తీసుకున్న ఆ మహిళ పిల్లలను ఇవ్వలేదు. ఫోన్ స్వీఛాఫ్ చేసుకొని ఉండటంతో తాము మోసపోయమని లబోదిబోమంటున్నారు. ఇలా ఒక్క సూర్యా పేట జిల్లాలోనే కాదు భూపాలపల్లి జిల్లాకి చెందిన దంపతులు, మంచిర్యాల జిల్లాకి చెందిన దంపతులు కూడా మోసపోయినట్టు సమాచారం.

పోలీసులకు చేరిన పంచాయతీ..

పిల్లలను ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి రూ. లక్షలు దండుకున్న కి లేడిని పోలీసులు అదపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ మహిళ ది సూర్యా పేట జిల్లాకి ఆనుకొని ఉన్న ఓ మండల పరిధిలోని ఒక తండాకు చెందిన మహిళగా తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా, ఆ కి లేడీని కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లల కోసం మాయ కీ లేడీల చేతిలో మోసపోయిన దంపతులకు పోలీసులు న్యాయం చేస్తారా ? లేక కీ లేడీ ల పక్షాన పోలీసులు ఉంటారా అని వేచి చూడాలి.

Advertisement

Next Story