ఇక్కడ ఫైల్ కదలాలంటే పైకం ముట్టాల్సిందే..

by Nagam Mallesh |
ఇక్కడ ఫైల్ కదలాలంటే పైకం ముట్టాల్సిందే..
X

దిశ సూర్యాపేట, కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా మిషన్ భగీరథ (ఆర్ డబ్ల్యూ ఎస్) ఇంట్రా కార్యాలయం ఇమాంపేట శివారులో మిషన్ భగీరధ వాచ్మెన్ క్వార్టర్స్ లో ఉద్యోగులు, విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 3సంవత్సరాలనుండి ఈ వాచ్మెన్ క్వార్టర్స్ నుంచి విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. జిల్లా కలెక్టరేట్ కు ఈ కార్యాలయం దూరంగా ఉండటం వల్ల అక్కడి అధికారులు ఆడింది ఆట పాడింది పాటగా చెల్లుబాటు అవుతున్నట్లు వినిపిస్తోంది.

డీల్ కుదిరితేనే ఫైల్ కదిలేది..

దేవుడి దర్శనం కావాలంటే పూజారి కరుణిస్తేనే సాధ్యమవుతుంది... అనే పద్ధతిలోనే కార్యాలయంలో ఏదైనా ఫైల్ కదలాలంటే అటెండర్ డీల్ కుదిర్చిన తరువాతనే ఫైల్ పై ఈ ఈ సంతకం పెడతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పు తెచ్చి పనులు పూర్తి చేసి బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లకు సూర్యాపేట జిల్లా మిషన్ భగీరథ (rws)ఇంట్రా అధికారుల వద్ద ముడుపులు చెల్లించలేక, తమ బాధను ఎవరికైనా తెలియజేస్తే తమ బిల్లు రాకుండా యిబ్బందులకు గురి చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులకోసం ఆఫీస్ బల్ల కింద చెయ్యి పెట్టందే ఫైల్ కదిలే పరిస్థితి లేదని దీనితో కాంట్రాక్టర్ లు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం లంచాలు లేకుండా ఫైలు కదలదంటూ హుకుం జారీ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి .

తోటి ఉద్యోగస్తుడి పైనే దాడికి ప్రయత్నం..?

సూర్యాపేట జిల్లాలోని ఓ డివిజన్ కు సంబంధించిన ఉద్యోగి పైన ఆ శాఖ ఉన్నతాధికారి చెయ్యి లేపి దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఆ శాఖ ఉద్యోగస్తులకు కూడా జీతాలు వేయకుండా తోటి ఉద్యోగస్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్ క్వార్టర్స్ కార్యాలయంలోనే రాత్రి వేళలో కాంట్రాక్టర్లతో విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని, రాత్రి వేళలో కార్యాలయంలోనే వసతి పొందుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మిషన్ భగీరథ (rws)ఇంట్రా కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయానికి దూరంగా ఉండడంతో ఆ అధికారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తోటి ఉద్యోగస్తులను, నోటికి వచ్చినట్లు దూషిస్తాడని విమర్శలు వస్తున్నాయి. కార్యాలయంలో అటెండర్ పై వస్తున్న ఆరోపణలను ఎంక్వయిరీ చెయ్యాలని, అవినీతిపరులపై ప్రభుత్వం కొరడా జులపాలని ప్రజలు కోరుతున్నారు.

అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదు..

ఈఈ శ్రీనివాస్ రావు, సూర్య పేట

మా కార్యాలయంలో ఇలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదు. పారదర్శకంగా ఫైల్ పూర్తి చేస్తాం. అంతే కాకుండా

నూతన భవనం పనులు కొనసాగుతూ ఉన్నాయి. బోర్డు ఏర్పాటు చేయిస్తాను.

Advertisement

Next Story