సూర్యాపేటలో ‘హైడ్రా’ హడల్..! ఇళ్లకు మార్కింగ్ వేస్తున్న అధికారులు

by Shiva |
సూర్యాపేటలో ‘హైడ్రా’ హడల్..! ఇళ్లకు మార్కింగ్ వేస్తున్న అధికారులు
X

దిశ, సూర్యాపేట: ప్రస్తుతం రాష్ట్రంలో ‘హైడ్రా’ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల ఉన్నతాధికారులు ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు, సమీపంలో ఉన్న నల్ల చెరువు సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఖాళీ స్థలాలు, వెంచర్లు, రోడ్లు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేందుకు సంబంధిత శాఖ అధికారులచే మార్కింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు.

అయితే, అవగాహన లేకుండా కొందరు సోషల్ మీడియాలో వివిధ రూపాల్లో ప్రచారం జరగడంతో సూర్యాపేటకు కూడా ‘హైడ్రా’ వచ్చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తామంతా ఇళ్లను కొల్పోతున్నమని వారికి వారే బయట చెప్పుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. గత మూడు రోజులుగా అధికారులు గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి మార్కింగ్ చేస్తుండగా ప్రజలు వారిని నిలదీస్తూ మార్కింగ్ చేయొద్దని అడ్డుకుంటున్నారు. తాము సుమారు 40 ఏళ్లుగా అ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నామని ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని, అటువంటి పరిస్థితి ఎదురైతే తమకు చావే శరణ్యం అంటూ అధికారులకు హెచ్చరిస్తున్నారు.

అధికారులు గుర్తించి ప్రాంతాలివే..

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ‘హైడ్రా’ పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న తరుణంలో సూర్యాపేటలో అధికారులు పలు ప్రాంతాల్లోని ఇళ్లకు మార్కింగ్ చేయడం ఆందోళనలకు దారి తీస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలోని బేచిరాగ్ మాదారం పరిధిలోని సర్వే నెం. 244,245, 246, 247, 248, 257, 257, 258, 264, 266, 267, 787, 788, 789, 790, 795, 796, 800 లోని మొత్తం 268 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. కేవలం ఒక సద్దుల చెరువు పరిసర ప్రాంతంలో మాత్రం 247 సర్వే నంబర్‌లో 115 ఎకరాల ఉంది. అందులో ప్రస్తుతం 80 ఎకరాల విస్తీర్ణం మాత్రమే చెరువు ఆక్రమితమై ఉన్నట్లుగా రికార్డుల్లో స్పష్టం అవుతోంది. అందుకు రెవెన్యూ శాఖ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశానుసారం ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు.

కాగా, ఆయా సర్వే నంబర్లలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో గత కొన్నేళ్ల క్రితం అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు రికార్డుల్లో వెల్లడైంది. ఇవి మున్సిపల్ పరిధిలోని 13, 14, 28, 29, 40, 41, 42, 43 వార్డుల్లో కొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందులో శ్రీశ్రీ నగర్, నెహ్రూ నగర్, ఏవీ ఎన్‌క్లేవ్, మందుల బజార్, ఇందిరా నగర్, హైటెక్ బస్టాండ్, హైమా నగర్, నిర్మల ఆసుపత్రి సమీపం, చాకలి బజార్, జేజే నగర్, తాళ్లగడ్డ, జనగాం రోడ్డు (హైదరాబాద్ - విజయవాడ హైవేపై వెంట ఉన్న ప్రాంతం)లో ఆక్రమణలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో సుమారు 2 వేల ఇళ్ల నిర్మాణాలు జరగగా.. అందులో సుమారు 900 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అయితే, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఉన్నతాధికారుల సమచారం మేరకే మార్కింగ్ చేపడుతున్నామని పేర్కొన్నారు. తమకు ఇళ్లను కూలగొట్టలనే ఆదేశాల ఏమి రాలేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed