రైతులు అధైర్యపడొద్దు.. కాంగ్రెస్ అండగా నిలబడుతుంది: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Shiva |
రైతులు అధైర్యపడొద్దు.. కాంగ్రెస్ అండగా నిలబడుతుంది: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి సూర్యాపేట: రైతులు అధైర్యపడొద్దని.. అండగా కాంగ్రెస్ నిలబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం వెళుతూ టేకుమాట్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రేణుక చౌదరి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.

రైతులు అధైర్యపడొద్దని, వారికి అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు వడ్లు తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని, తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూడండి సార్.. అంటూ రేవంత్ రెడ్డి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. క్వింటాల్ కు ఐదు శాతం కోత పెడుతూ టార్ఫాలిన్లు ఇవ్వకుండా, కాంటా వేసిన వడ్ల బాధ్యతను తీసుకోకుండా రైతుల నెత్తిపై వాటి సంరక్షణ భారం మోపడం అన్యాయంగా ఉందన్నారు.

కొనుగోలు చేసిన వడ్లను ఐదు రోజులుగా తీసుకెళ్లడం లేదని, దీంతో అమ్మకానికి 20 రోజులకు పైగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతున్నామని రైతులు వాపోయారు. తూకం వేశాక కూడా బస్తాల ఎగుమతి జరిగే వరకు ఇక్కడే మరిన్ని రోజులు ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, రేణుక చౌదరి లకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు.

Advertisement

Next Story