ధాన్యం కొనుగోలులో అంతా మోసం

by Javid Pasha |
ధాన్యం కొనుగోలులో అంతా మోసం
X

దిశ, నల్లగొండ బ్యూరో: పంట పండించడంకంటే అమ్ముకోవడానికే రైతు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఆరుగాలం కష్టపడిన పండించిన ధాన్యాన్ని అష్టకష్టాలు పడి విక్రయించాల్సిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో అంతా దగా నడుస్తోంది. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. తాలు గింజల పేరుతో ప్రతి బస్తాకు రెండు కిలోలు కోత కొస్తున్నారు. పొట్టి గింజ పేరుతో సెకండ్ గ్రేడ్ ధాన్యంగా నిర్ణయించి నిలువునా దోచుకుంటున్నారు . మిల్లుల వద్ద హమాలీలు లేని కారణంగా ధాన్యం బస్తాలు దిగుమతి కాకపోతే ఆలస్యమైందని అక్కడ కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. క్ష్రేత స్థాయిలో అంతా దోపిడీ యథేచ్ఛగా సాగుతూనే ఉంది. రైతు నుంచి వసూలు చేస్తున్న ప్రతి పైసాకు కూడా అధికారులకు భాగస్వామ్యం ఉన్నందునే వారంతా నోరు మెదపకుండా ఉన్నారనే ఆరోపణలు జోరుగా ఉన్నాయి. అందరూ కలిసి అన్నదాతను నిండా ముంచుతున్నారు.

పంట సాగు కోసం అడుగులేసినప్పుడు నుండి చేతికి వచ్చిన పంటను విక్రయించే వరకూ ప్రతి సందర్భంలో అన్నదాత దోపిడీకి గురవుతున్నాడు. పెట్టిన పెట్టుబడి శారీరక శ్రమ అన్ని కూడా వృథా అయిపోతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న చివరికి తనకు తినడానికి తిండి కూడా కొనుక్కోలేదు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. పండించిన పంటను విక్రయించి ఇంటికి వెళ్లేసరికి తనకు చిల్లి గవ్వ కూడా మిగడం లేదు .పెద్ద ఎత్తున రైతు దోపిడీకి గురవుతున్నారు .ధాన్యం తూకం వేసే సమయంలో తాలు గింజల పేరుతో ప్రతి బస్తాకు 2 కిలోల కోత, 800 బస్తాలకు 10బస్తాల ధాన్యం కోత విధిస్తున్నారు. అంతేకాకుండా పొట్టి గింజ పేరుతో సెకండ్ గ్రేడ్ ధాన్యంగా నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారు .

కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసి చిన్నది అయితే రూ.500 పెద్ద రాసి అయితే రూ.1000 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మిల్లుల వద్ద హమాలీలు లేని కారణంగా ధాన్యం బస్తాలు దిగుమతి కాకపోతే ఆలస్యమైంది అనే పేరుతో అక్కడ కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక లారీలో సుమారు 700 బస్తాల వరకు ఉంటాయి. అయితే లారీ నిలిచిందనే పేరుతో బస్తాకు రెండు రూపాయలు చొప్పున 700 బస్తాలకు రోజుకు రూ. 1400 వసూలు చేస్తున్నారు. దాంతోపాటు డ్రైవర్ కూడా బత్తా పేరుతో రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లు కలిపి రైతులను రక్తం జలగల లాగా పీల్చుక తింటున్నారు.

జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐకెపి 84 ,పిఏసిఎస్ 229 ,ఎఫ్ పి ఓ పది ధాన్యం కేంద్రాల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది.17,570 మంది రైతులు నుంచి1,61,259.208 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సుమారు 95.47కోట్లు ధాన్యం సొమ్ము రైతుల వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు..

నల్లగొండ జిల్లాలో..

జిల్లాలో ఐకెపి 169 ,పిఎసిఎస్ 174 ,ఎఫ్ పి ఓ 3 మొత్తంగా 346 కేంద్రాల నుంచి ధాన్యం సేకరణ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,94,230 మెట్రిక్ టన్నుల దాన్యము 238548 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు ఈ ధాన్యం మొత్తం విలువ రూ.1018.11కోట్లు కాగా ఇప్పటివరకు రూ.750 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు.

సూర్యాపేట జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 289 కేంద్రాలు ఏర్పాటు చేశారు 39035 మంది రైతుల నుంచి 256037మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఆ ధాన్యం విలువ రూ. 527.43.కొట్లు కాగా రూ.296.27కోట్లు చెల్లించినట్లు అధికారులు చెపుతున్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తున్న మిల్లర్లు..

ధాన్యం దిగుబడి వస్తుందని రెండు నెలల ముందు నుంచే వ్యవసాయ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లై ,ఐకెపి సిబ్బంది అంతా కలిపి హడావుడి చేస్తుంటారు .కానీ తీరా చూస్తే ధాన్యం కొనుగోలు చేసే సమయం వచ్చేసరికి లారీలు,త హమాలీల కొరత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ధాన్యం ఎగుమతికి లారీల సరఫరా కోసం వేసి టెండర్లలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 100 నుంచి 150 లారీలు అందుబాటులో ఉంటే 500 లారీలు అందుబాటులో ఉన్నట్టుగా లారీ యజమానులు టెండర్ వేస్తున్నారు. కానీ అధికారులు ఈ స్థాయిలో లారీలు సరఫరా చేయగలరా లేదా అంటూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే టెండర్కు అనుమతిని ఇస్తున్నట్లు సమాచారం . లారీల కృత్రిమ కొరత వల్లే సమస్య తీవ్రమైతున్నట్లు స్పష్టమవుతుంది. అందుకే రైతులు రోజుకు ఒకచోట రోడ్డు ఎక్కి ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ధర్నాలకు దిగుతున్నారు. అంతేకాకుండా లక్షల క్వింటాళ్ల ధాన్యం మిల్లులోకి చేరుతున్న సమయంలో ఆ మొత్తాన్ని దిగుమతి చేసుకోవడానికి అవసరమైన హమాలీల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టడం అధికారుల విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది .కేవలం లారీల కొరత దానికి అనుకున్న స్థాయిలో హామాలీల కొరత వల్లే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా అధికారులు నోరు మెదపడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు

అందరూ కుమ్మక్కై ..

ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పేరుతో అందరూ కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే . ధాన్యం తూకం వేయడానికి డబ్బులు వసూలు చేస్తున్న హామాలీలు సమయానికి లారీ అన్లోడ్ కావడం లేదని కారణం చూపి మిల్లర్లు వసూలు చేస్తున్న డబ్బులు, తాలు గింజలు పొట్టి గింజలు అని పేరుతో డబ్బులు వసూలు చేయడం, అధికారులకు తెలియకుండానే జరుగుతుందంటే నమ్మశక్యం కావడం లేదు. రైతు నుంచి వసూలు చేస్తున్న ప్రతి పైసాకు కూడా అధికారులకు భాగస్వామ్యం ఉన్నందునే వారంతా నోరు మెదపకుండా ఉన్నారనే ఆరోపణలు జోరుగా ఉన్నాయి. ధాన్యం పండించిన ఏ రైతును అడిగిన కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిని పూసగుచ్చినట్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అధికారులు మాత్రం రైతుల కష్టాలను అడిగి తెలుసుకోడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి కృత్రిమ కొరత లేకుండా కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది మరో 20 రోజులు గడిస్తే వర్షాకాలం రానుంది.

Advertisement

Next Story