నీళ్లు బంద్ చేయండి బాబోయ్...

by Sumithra |
నీళ్లు బంద్ చేయండి బాబోయ్...
X

దిశ, తుంగతుర్తి : ఇక ఈ నీళ్లు మాకు చాలు...! వెంటనే ఆపండి సార్లు...!! అంటూ తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల రైతాంగం శ్రీరామ్ సాగర్ ( ఎస్సారెస్పీ) రెండో దశ అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. నీటి విడుదల ఇంకా జరిగితే పంటలన్నీ దెబ్బతింటాయంటూ రైతాంగం పేర్కొంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నెల రోజుల క్రితం వరకు కూడా ఇక్కడి రైతాంగం శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) నీళ్లు విడుదల చేయాలంటూ వివిధ రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలో నెలకొన్న వివిధ రకాల పరిస్థితులతో నీటి విడుదల జరగలేదు. అనంతరం వచ్చిన భారీ వర్షాలతో నియోజకవర్గ వ్యాప్తంగా కుంటలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోయి అలుగులు పోశాయి.

దీనికి తోడు జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు గత నెల 16 నుంచి నీటి విడుదల జరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య పంటల సాగుకు అసలు కంటే ఎక్కువే నీటి సౌకర్యం కలిగింది. అయితే వరి పంటలన్నీ క్రమక్రమంగా కోతలకు వస్తుండడంతో వచ్చే నీళ్లతో తామంతా నష్టపోయే ప్రమాదం ఉందంటూ రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దొడ్డు రకం వడ్ల పంటల కోతలు చాలా ప్రాంతాల్లో జరిగాయి. మిగిలిన సన్న వడ్ల పంట కూడా ఇప్పుడిప్పుడే చేతికందొస్తుంది. మరో 15 లేదా 20 రోజుల్లో పూర్తిస్థాయిలో ఈ పంట అంతా చేతికి రానుందని రైతాంగం వివరిస్తోంది. అలాంటప్పుడు నీటి వసతి అవసరం ఉండదని పేర్కొంటుంది.

నెల రోజుల్లో జిల్లాకు దాదాపు 4 టీఎంసీల నీళ్లు..

గత నెల 16న కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా సూర్యాపేట జిల్లా వైపు విడుదలైన నీళ్ల సామర్థ్యం నెల రోజుల్లోనే దాదాపు 4 టీఎంసీలకు చేరింది. 69 డిస్ట్రిబ్యూటరీ ద్వారా తుంగతుర్తి, 70, 71 డిస్ట్రిబ్యూటర్ల నుండి నాగారం, సూర్యాపేట ప్రాంతాలకు ఈ నీళ్లు వెళుతున్నాయి. మొదట్లో 500 క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు అనంతరం క్రమక్రమంగా దాన్ని 1200 పై చిలుకు పెంచి విడుదల చేశారు. విడుదలైన జలాలు తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి మండలాలలో అప్పటికే వర్షాలతో సమృద్ధిగా నిండిన చెరువులు, కుంటలకు చేరి అలుగులు పోశాయి. అంతేకాకుండా ఈ తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.

నియోజకవర్గంలో 95 వేల ఎకరాల్లో వరి సాగు

ఓవైపు సమృద్ధిగా పడ్డ వర్షాలతో నైతేనేమి మరోవైపు ఎస్సారెస్పీ రెండో దశ జలాల విడుదలతో నైతేనేమి మొత్తానికి నియోజకవర్గంలో 94 వేల 775 ఎకరాల్లో వరి పంట సాగయింది. ఇందులో అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 20 వేల 695 ఎకరాల్లో, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 11 వేల 544 ఎకరాల్లో వరి పంట సాగయింది. అలాగే జాజిరెడ్డిగూడెం మండలంలో 19 వేల 190, మద్దిరాలలో 13 వేల 442, నాగారంలో 17 వేల 551, నూతనకల్ లో 12 వేల 356 ఎకరాల్లో పంటసాగయింది.

Advertisement

Next Story

Most Viewed