శివన్న గూడెం ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

by Kalyani |
శివన్న గూడెం ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
X

దిశ ,మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివన్న గూడెం ప్రాజెక్టు పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దని, వారికి తక్షణమే 50 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు . శుక్రవారం ఆయన ప్రాజెక్టును సందర్శించి భూ నిర్వాసితులతో, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తాను అధికార పార్టీ ఎమ్మెల్యే నేనని ముఖ్యమంత్రితో మాట్లాడి భూనిర్వాసులకు అందాల్సిన బెనిఫిట్స్ అన్నింటిని అందించే బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు.

ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం నుంచి శివన్న గూడెం వెళ్లే రహదారి వద్ద జరుగుతున్న పనుల వలన నర్సిరెడ్డి గూడెం గ్రామం ముంపునకు గురవుతుందని ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని గత 15 రోజుల నుంచి ప్రాజెక్టు పనులు జరగకుండా ముంపు గ్రామస్తులు ఆందోళన చేపడుతూ పనులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అధికారులతో ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామంలో 289 ఇండ్లు ఉండగా కేవలం 50 ఇండ్లవారే గ్రామంలో ఉంటున్నారని తమకు ఆర్ అండ్ ఆర్ కింద ప్లాట్లు ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ అప్పటివరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యేను కోరారు.

వచ్చే మూడు నెలల్లో వర్షాలు ఉన్నందున రాకపోకలకు ఇబ్బంది కాకుండా నర్సిరెడ్డి గూడెం గ్రామం నీటితో ముంపునకు గురికాకుండా చూసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే వారికి నచ్చ చెప్పారు. సి ఓ టి వరకే పనులు జరుగుతాయని ప్రాజెక్టు ఎత్తు వరకు పనులు చేయకూడదని ఇంజనీర్లకు సూచించారు. నర్సిరెడ్డి గూడెం గ్రామస్తులకు ఏలాంటి ఇబ్బంది జరిగిన తాను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, కానీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దని ఆయన సూచించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే పదేళ్ల సమయం పట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆయన తెలిపారు.

ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి ,వెంకీ పల్లి తండా గ్రామస్తులకు చింతపల్లి మండలం ఉప్పరిగూడెంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మర్రిగూడ మండల కేంద్రంలో ఎక్కడ వీలుంటే అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ప్లాట్లతోపాటు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే చెప్పారు. అంతకుముందు వెంకేపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మలపల్లి మురారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నరసింహారెడ్డి ఇరిగేషన్ ఈఈ రాములు నాయక్, డీఈలు కాశీం, సురేందర్, ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ దాస్ శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు, రామస్వామి గుట్ట చైర్మన్ రాపోలు గిరి, భూ నిర్వాసితులు పెరమాల చంద్రయ్య, ఐతవోని వెంకటయ్య ,అయితే గొని సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed