canals : రైతులు సిద్ధం.. మరి అధికారులో..!

by Sumithra |
canals : రైతులు సిద్ధం.. మరి అధికారులో..!
X

దిశ, చిలుకూరు: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి బిరబిరా పరుగులిడుతున్న కృష్ణమ్మ ఒక్కో ప్రాజెక్టును నింపుకుంటూ వస్తోంది. ఈ నెలాఖరు నాటికి నాగార్జునసాగర్ ప్రాజెక్టును కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. సాగర్ నీటిని పొలాల చెంతకు చేర్చే డిస్ట్రిబ్యూటింగ్ కాలువలు మాత్రం అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు ప్రధాన సాగునీటి వనరైన ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు ఇటీవల దాదాపు రూ.190 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. దాంతో పనులు కూడా ప్రారంభించారు. ప్రధాన కాలువకు బుంగలు పడి నీరు ఆయకట్టు చివరి పొలాలకు నీరందడం లేదనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. మరి పొలాల్లోకి నీరందించే డిస్ట్రిబ్యూటింగ్ కాలువల పరిస్థితి గందరగోళంగా ఉంది. సంబంధిత కాలువలకు పలు చోట్ల గండ్లు పడి చివరి పొలాలకు సాగు నీరందని దుస్థితి నెలకొంది. ఈ పంట కాలువలకు అరకొరగా చేసిన లైనింగ్ శిథిలమైనా సంవత్సరాలుగా పట్టించుకునే నాథుడు లేడు. ఉదాహరణకు చిలుకూరు మండలం చిలుకూరులో ఉన్న ఎల్ 2 కాలువనే పరిశీలించినట్లయితే ఈ కాలువ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. పలుచోట్ల లైనింగ్ కూలిపోయింది. బుంగలు పడి సాగునీరు అధిక శాతం వృథా అవుతోందని ఆయకట్టు చివరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కాలువ పరిధిలో చిలుకూరు, సీతారామపురం, నారాయణపురానికి చెందిన రైతులు 2 వేల ఎకరాల మేర సేద్యం చేస్తున్నారు. 1700కు పైగా రైతులకు ఈ కాలువే ఆధారం. ఎగువన ఎక్కడికక్కడ కాలువ శిథిలమై, బుంగలు పడి తమ పొలాలకు నీరందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ విషయమై తమ సమస్య పరిష్కరించాలని, కాలువ మరమ్మతులు చేపట్టాలని ఇటీవల చిలుకూరుకు వచ్చిన కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతికి రైతులు వినతిపత్రం అందించారు. అయినా నేటికీ చర్యలేమీ తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి డిస్ట్రిబ్యూటింగ్ కాలువలు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. ముక్త్యాల కాలువలకు గండ్లు పడి నీరు వృథా అవుతుందని తెలిసిన అధికారులకు డిస్ట్రిబ్యూటింగ్ కాలువల దుస్థితి కనిపించలేదా అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో కాలువల స్థితిగతులను పరిశీలించే అధికారులు ఈసారి అటువైపు చూసిన పాపాన కూడా పోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

నిధులు రాగానే పనులు చేపడతాం.. మానస, ఏఈ(ఐబీ), కోదాడ.

డిస్ట్రిబ్యూటరీ కాలువల మరమ్మతులకై ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం. ప్రస్తుతానికి ముక్త్యాల కాలువకు నిధులు వచ్చాయి. పనులు పురోగతిలో ఉన్నాయి.



Next Story