ఆ బ్రిడ్జిపై నుంచి వెళ్లాలంటే గుండెల్లో దడదడ.. రాత్రైతే ఇక అంతే!

by Bhoopathi Nagaiah |
ఆ బ్రిడ్జిపై నుంచి వెళ్లాలంటే గుండెల్లో దడదడ.. రాత్రైతే ఇక అంతే!
X

దిశ, వలిగొండ : అది రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసే ప్రధాన రహదారి. హైదరాబాద్- విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకోవాలంటే ఈ రోడ్డే ప్రధానం. అంతే కాదు.. మత్స్యగిరి నరసింహుడిని, సుంకేశుల వెంకటేశ్వర స్వామిని, భువనగిరి వెళ్లాలన్నా ఇదే దిక్కు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న భువనగిరి - చిట్యాల ప్రధాన రహదారిపై ఉన్న వలిగొండ మూసీ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్వహణను గత పదేళ్లుగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతోంది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెనపై అడుగుకో గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు ఆ బ్రిడ్జిపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు.

ఇక రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహదారులు కిందపడి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. రోజుకు వందల వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై ఉన్న వంతెనకు మరమ్మతులు చేయించకపోవడంతో నిత్యం వేలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పకైనా స్పందించి మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed