భువనగిరికు తలమానికంగా ఫోర్ట్ అభివృద్ధి : ఎమ్మెల్యే

by Naveena |   ( Updated:2024-10-23 13:40:23.0  )
భువనగిరికు తలమానికంగా ఫోర్ట్ అభివృద్ధి : ఎమ్మెల్యే
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి ఖిల్లాను భువనగిరి కి తలమానికంగా నిలిచేలా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బుధవారం భువనగిరి ఫోర్ట్ రోప్ వే పనులపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించి సమీక్ష నిర్వహించారు. భువనగిరి ఖిల్లా అభివృద్ధి వలన అభివృద్ధితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ పనులన్ని త్వరితగతిన ప్రారంభించుకొని అత్యంత సుందరీకరణ చేపడతామని తెలిపారు. భువనగిరి జిల్లా పైన హోటళ్లు, పార్కులు, భువనగిరి ఖిల్లా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. రోప్ వే పనులలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామన్నారు. రోప్ వే నుంచి 650 మీటర్ల‌ మేర నాలుగు లైన్ల రోడ్డు వస్తుందన్నారు. ఈ అభివృద్ధి పనుల వలన భువనగిరి పట్టణంలోని భూముల విలువ పెరుగుతుందని, పట్టణం అభివృద్ధి చెందుతుందని, ఈ అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు‌. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం వద్ద స్టేడియం నిర్మాణం కోసం రూ. 33 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలో ఈ పనులు ప్రారంభమై మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం జరుగుతుందన్నారు. భువనగిరి ఇండోర్ స్టేడియం వద్ద కూడా స్థలం కబ్జాలో ఉందన్నారు. భువనగిరి ఫోర్ట్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ. 58 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలో మరిన్ని నిధులు వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబా జిండగే, టూరిజం జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రామంజుల రెడ్డి, భువనగిరి తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed