రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బొట్టు గూడ పాఠశాల నిర్మాణం: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |   ( Updated:2024-10-17 13:51:00.0  )
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బొట్టు గూడ పాఠశాల నిర్మాణం: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ: ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టు గూడ ఉన్నత పాఠశాలను రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు లేనివిధంగా తీర్చి దిద్దనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆయన బొట్టు‌గూడా ఉన్నత పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న ఈ పాఠశాల నిర్మాణ పనులకు ఇటీవల మంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు పాఠశాల బేస్మెంట్ పిల్లర్ పనులు పూర్తి కాగా, మంత్రి ఆ పనులను పర్యవేక్షించడమే కాకుండా, కాంట్రాక్టర్‌కు, పాఠశాల హెడ్ మాస్టర్‌‌కు పలు సూచనలు చేశారు. బొట్టు గూడ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్థాయికి మించి నిర్మాణం చేపట్టాలని.. అన్ని తరగతి గదులలో డిజిటల్ టీవీల ఏర్పాటు, ప్రత్యేకించి 9, 10 తరగతులకు ప్రత్యేక డిజిటల్ తరగతులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

అన్ని తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు, స్పోర్ట్స్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకించి అదనపు తరగతులను నిర్వహిస్తామని, పాఠశాలలో అన్ని గదుల్లో ఏసీ తో పాటు, విద్యార్థులకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ,పార్కింగ్, అలాగే అధునాతన టైల్స్, ఫ్లోరింగ్ ,ఎలక్ట్రికల్ లైటింగ్ వంటి పనులలో ఎలాంటి నాణ్యత లోపించకుండా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.భవిష్యత్తులో అవసరమైతే మరో అంతస్తు నిర్మించేందుకు అవకాశం ఉండేలా నిర్మాణం ఉండాలని అన్నారు. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story