నిలుచుంది కానీ నీళ్లివ్వలేదు..!?

by Sumithra |
నిలుచుంది కానీ నీళ్లివ్వలేదు..!?
X

దిశ, చిలుకూరు : రోజులు కాదు.. వారాలు కానే కాదు.. నెలలు అసలే కాదు.. కొన్ని సంవత్సరాలుగా ఈ 'భగీరథ' జల భాండాగారం (వాటర్ ట్యాంక్) ఆ తండా ప్రజలకు తాగునీరివ్వలేని దుస్థితి.. కళ్ల ఎదుటే కామధేనువులా కనిపిస్తున్నా కూసింత నీరివ్వలేని ఈ దైన్యానికి కారణమెవ్వరని తండా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మండలంలోని గిరిజన గ్రామమైన జానకి నగర్ తండాలో గత ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మించింది. సుమారు రూ. 10 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించినప్పటికీ నీటి సరఫరాకు ఎలాంటి అనుసంధాన వ్యవస్థ లేక ఇది నిరుపయోగంగా మారింది. తాము ఫిర్యాదు చేసినప్పుడల్లా అధికారులు వస్తున్నారు, పోతున్నారు తప్ప తీసుకున్న చర్యలు శూన్యం అని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారి ఈ ట్యాంక్ ను సందర్శించి వెళ్లారని, పరిస్థితి యధా మామూలే అని వారంటున్నారు. గ్రామంలో ఉన్న మరో ట్యాంక్ నీరు గ్రామానికి సరిపోవడం లేదు.

దీంతో చేసేదేమీ లేక గ్రామంలో దూరాన ఉన్న బోర్ల నుంచి నీరు మోసుకొచ్చుకుంటున్నామని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు తాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ పేషీలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగా మారిందని అంటున్నారు. ఈ సమస్యను 'దిశ' ఏఈ సిద్ధార్థతో ప్రస్తావించగా ఆ ట్యాంక్ సక్రమంగానే ఉందని, మళ్లీ ఓసారి పరిశీలిస్తామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వంలో అధికారులు స్పందించి ఈ ట్యాంక్ నుంచి తమకు తాగునీరు సరఫరా చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed