అంబుజా వద్దురా.. రామన్నపేట ముద్దురా..

by Sumithra |
అంబుజా వద్దురా.. రామన్నపేట ముద్దురా..
X

దిశ నకిరేకల్/ రామన్నపేట : అంబుజా వద్దురా.. రామన్నపేట ముద్దురా.. అనే నిరసనల నడుమ అంబుజా సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 360 ఎకరాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనన్న అంబుజా సిమెంట్ కంపెనీని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల ఉపాధి దేవుడెరుగు పాడిపంటలు, వాయు కాలుష్యంతో ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏర్పాటు చేయనీయమని ప్రజలు, స్థానిక నాయకులు వేలాదిగా తరలివచ్చి ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. అదేవిధంగా అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు పై నిరసనల హోరుతో ధర్నా చేపట్టారు.

నిరసనల నడుమ అభిప్రాయ సేకరణ..

స్థానిక ప్రజలు, యువత, నాయకులు కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. ప్రజలను ఎక్కడికి అక్కడే అడ్డుకునే విధంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు ఎక్కడికి అక్కడే ఆంక్షలు విధించారు. దీంతో తమ న్యాయమైన డిమాండ్ ను తెలిపేందుకు వెళ్ళనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు భారీ స్థాయిలో కదిలి వచ్చి కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు.

నాయకుల అక్రమ అరెస్టులు..

ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రజా పోరాట సమితి నాయకులు నూనె వెంకటస్వామిలను పోలీసులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని విషయాన్ని తెలిపేందుకు వెళితే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం సమంజసం కాదని నాయకులు మాట్లాడారు. ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లుగా తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారన్నారు.

ఇతర ప్రాంతాల మహిళల రాకతో గందరగోళం..

ప్రజాభిప్రాయ సేకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా నుంచి మహిళలు తరలివచ్చారు. దీనిని గమనించిన స్థానికులు వారిని గుర్తించి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారు చెప్పే పొంతన లేని సమాధానాలు విని అక్కడ గందరగోళం జరిగింది. వెంటనే వారిని ఆ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి పోలీసులు పంపించేశారు. దీనిని బట్టి చూస్తే ఇతర ప్రాంత ప్రజల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ గెలవాలని ఉద్దేశం అంబుజా సిమెంట్ కంపెనీ పూనుకుందనేది తెలుస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed