తాగునీటి సరఫరాలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్

by M.Rajitha |
తాగునీటి సరఫరాలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జలమండలిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ సూచించారు. గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం మాసబ్ ట్యాంక్ లోని టీయూఎఫ్ఐడీసీ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడి మయాంక్ మిట్టల్, ఉన్నతాధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీవరేజ్, తాగునీరు సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్‌లు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. వర్షాల వల్ల తాగునీరు కలుషితం అయ్యే అవకాశమున్నందున నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు.. నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాటర్‌లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అవకాశమున్న ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లలు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీటి సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పని చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్‌ తెరవకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని చెప్పారు. భారీ వర్షాలకు జలమండలికి చెందిన ఆస్తుల నష్ట వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, ఈఎన్సీ జియావుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed