- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ లక్ష్మణ్ కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని, ప్రజాధన్నాని దుర్వినియోగం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ద్వారా చౌకగా వచ్చే విద్యుత్‌కు బదులుగా కమిషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవకతవకలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలోనే చెప్పారని, కానీ మూడు నెలలు దాటినా మాటలకు తగిన చేతల్లేవని ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నదన్నారు.
ఇప్పటికైనా విద్యుత్ కొనుగోలుకు ఎన్టీపీసీతో ఒప్పందం కుదుర్చుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అవినీతిపరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నదనే అనుమానం కలుగుతున్నదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్టీపీసీ ఇటీవల రెండు సార్లు లేఖ రాసిందని, కానీ స్పందన కరువైందన్నారు. ఇకపైన కూడా ఇలాగే ఉంటే మరో రాష్ట్రానికి విక్రయిస్తామని ఎన్టీపీసీ హెచ్చరిస్తున్న విషయాన్ని లక్ష్మణ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ స్పందించకపోవడంతో గత బీఆర్ఎస్ లాగానే కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదనే అనుమానం తలెత్తుతుందన్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 80% మన రాష్ట్రానికే ఇవ్వడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందన్నారు.
వేసవి ఇంకా తీవ్రం కాకముందే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని, రానున్న రోజుల్లో ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పగటిపూట వ్యవసాయానికి కరెంటు అందకపోవడంతో మళ్ళీ రాత్రి సమయాల్లో పొలాలకు రైతులు వెళ్ళాల్సి వస్తున్నదని, పాము కాటుకు గురయ్యే తిప్పలు వస్తున్నాయన్నారు. గేట్లు ఎత్తి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించే తీరులో ఫక్తు రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి తొలుత రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించాలని సూచించారు. రాజకీయాల్లో మునిగిపోతున్న సీఎం రేవంత్.. కరెంటు కష్టాలు, సాగునీటి ఇబ్బందులు, ప్రజలకు తాగునీరు లేక పడుతున్న తిప్పలు తదితరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ప్రజాస్వామ్యం మీద ఆయనకు మీద విలువ లేదని, ఎప్పుడూ దేశం మీదా, ప్రధాని మోడీ మీదా విషం కక్కుతూ ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఉలుకెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం లెక్కా పత్రం లేకుండా ఆ పార్టీ విరాళాలు తీసుకున్నదని, ఇప్పుడు పక్కా లెక్కలు తేలడంతో విలవిలలాడిపోతున్నదని అన్నారు. రాహుల్‌గాంధీకి న్యాయస్థానాలపైన నమ్మకం లేదన్నారు. కేజ్రీవాల్ అరెస్టు గురించి స్పందిస్తూ, నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు ఉన్నందునే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందన్నారు.