సీఎం పదవికి రేవంత్ పనికి రాడు: ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-05-01 15:50:34.0  )
సీఎం పదవికి రేవంత్ పనికి రాడు: ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఏమాత్రం పనికిరాడని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. ఆయనవి ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప చేతలు లేవని విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సంస్కృతికి రేవంత్ రెడ్డి కొత్త అని ఆయన పేర్కొన్నారు. ఆయన ముందు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, అంబేద్కర్‌ను అవమానపరిచింది కాంగ్రెస్ అని ఆయన ధ్వజమెత్తారు. లోకికవాదంపై కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చురకలంటించారు.

నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు రాజ్యాంగo ధ్వంసమవుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రే అబద్ధపు పునాదుల మీద నిర్మించబడిందని ఘాటు విమర్శలు చేశారు. అధికారానికి దూరంగా కాంగ్రెస్ ఉండలేకపోతోందని ఫైరయ్యారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి తప్పు దొరకడం లేదని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటారని ఆయన చురకలంటించారు.

రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని, మోడీ బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ఎవరూ కదిలించలేరని ప్రధానియే స్పష్టం చేశారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోలనే మార్ఫింగ్ చేశారంటే కాంగ్రెస్ వెనుక ఎవరున్నారనేది తేలాలన్నారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోల వెనుక చైనా కమ్యూనిస్టులున్నారా..? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. వీడియోలను మార్ఫింగ్ చేసి, విష ప్రచారం చేసే దిగజారుడు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు. బీసీల రిజర్వేషన్లను ముస్లింలు తన్నుకుపోతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఫైల్స్‌ను కాంగ్రెస్ ఎందుకు తొక్కిపెట్టిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఒప్పందం ఉంది కాబట్టే కాళేశ్వరం ఫైల్స్ ముందుకు కదలడం లేదన్నారు. మద్యం కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం వెనుక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ కులాలకు న్యాయం చేయాలని మోడీ చూస్తున్నారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు ఇవ్వకుండా ఎస్సీ వర్గాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని లక్ష్మణ్ మండిపడ్డారు.

Also Read...

సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

Advertisement

Next Story