సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధే: MP బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-06 16:51:20.0  )
సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధే: MP బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అది ఇటలీ ఇండియా కూటమి అని ఆయన విమర్శలు చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు దీనిపై ఎందుకు స్పందించలేదని బండి ఫైరయ్యారు. హిందూ ధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఇండియా కూటమి ఎజెండాగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని కుట్ర చేసినోళ్లంతా సమాధుల్లో ఉన్నారని, దీన్ని ఈ కూటమి గుర్తుంచుకోవాలని బండి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ వారసుల జోలికొస్తే ఔరంగజేబు నుంచి బ్రిటీష్ వాళ్ల వరకు అందరూ అంతమైపోయిన విషయాన్ని కుహానా లౌకిక వాళ్లంతా గుర్తుంచుకోవాలని ధ్వజమెత్తారు.

సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా సరే.. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని బండి హెచ్చరించారు. గతంలో నుపూర్ శర్మ, రాజాసింగ్‌పై మొరిగిన గళాలు, ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఎందుకు మూతపడ్డాయని బండి ప్రశ్నించారు. అందుకే అది నిజమైన ఇండియా కూటమి కాదని, ఇటలీ ఇండియా కూటమి అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా ఆ కూటమి భాగస్వామ్యపక్షాలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించాలని, లేదంటే హిందూ ద్రోహులుగా గుర్తించకతప్పదని సంజయ్ హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూ సమాజాన్ని బండి కోరారు.

రవీందర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు

హోంగార్డు రవీందర్‌ను దూషించడంతో పాటు ఆయనపై సంబంధిత పోలీసులే పెట్రోలు పోసి నిప్పు పెట్టారని, ఈ విషయాన్ని రవీందర్ కుటుంబ సభ్యులే చెబుతున్నారని బండి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ సైతం ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసిందన్నారు. రవీందర్ మాట్లాడిన వీడియో దృశ్యాలను చూసిన వారంతా చలించిపోయారని ఆయన పేర్కొన్నారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి సర్కార్‌దే బాధ్యత అని ఆయన అన్నారు.

జీతాలివ్వలేని కేసీఆర్‌కు ఓట్లడిగే నైతిక హక్కులేదని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని బండి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఉన్న బండి సంజయ్ రవీందర్ సోదరుడు ప్రవీణ్‌తో పాటు, హోంగార్డ్ అసోసియేషన్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్‌తో వీడియో కాల్ మాట్లాడారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యలను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని తెలిపారు. అట్లాగే హోంగార్డుల సమస్యలపై జేఏసీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Advertisement

Next Story