కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి మంత్రులు.. రానున్న ఎన్నికల్లో వీరితో చిక్కులేనా?

by GSrikanth |
కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి మంత్రులు.. రానున్న ఎన్నికల్లో వీరితో చిక్కులేనా?
X

సీఎం కేసీఆర్ కేబినెట్‌లోని సగం మంది మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అసైన్డ్ లాండ్స్‌ను సొంతం చేసుకోవడం, ఫారెస్ట్ భూములకు కంచెలు వేయడం, శిఖం భూముల్లో చొరబడటం, ప్రైవేటు వ్యక్తుల భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి వివాదాల్లో మినిస్టర్ల హస్తం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో కొందరిపై నేరుగా ఆరోపణలు వస్తుండగా, ఇంకొందరు తమ సన్నిహితులు, బంధువులు చేసే భూ దందాలకు సపోర్టుగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భూ వివాదాల్లో ప్రమేయం ఉన్న మంత్రులతో పార్టీకి నష్టం వస్తుందేమోననే ఆందోళన పార్టీ పెద్దలకు కలవర పెడుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్‌లో పని చేసిన తక్కువ మంది మంత్రులపై అవినీతి ఆరోపణలొచ్చాయి. ఒకట్రెండు ఘటనల్లో మంత్రుల పేర్లు రాగానే సీఎం వెంటనే విచారణకు ఆదేశించారు. సదరు మంత్రుల నుంచి వివరణలు తీసుకున్నారు. కానీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్‌లోని మంత్రులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం సర్వసాధరణమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. మెజార్టీ మినిస్టర్లకు హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి. వాటిని చాలా మంది మంత్రులు పదవి వచ్చిన తర్వాతే కొనుగోలు చేసినట్టు ప్రచారం ఉన్నది. అయితే తమ ఫామ్ హౌజ్‌కు ఆనుకొని ఉన్న సర్కారు భూములనూ వారు కబ్జా చేసి బౌండరీస్ పెట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు మంత్రులైతే తమ ఫామ్ హౌజ్ కు సమీపంలోని ప్రైవేటు వ్యక్తులను బెదిరించి వారి భూములను కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

ఆరోపణలపై ఆరా

భూ వివాదాల ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆ లీడర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా ? కేవలం రాజకీయ కోణంలోనే వారిపై విమర్శలు వస్తున్నాయా? అనే విషయాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు ప్రత్యేకంగా నియమించుకున్న నిఘా టీమ్స్ ద్వారా పూర్తి డిటేయిల్స్ తెప్పించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఆరోపణలు వస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొచ్చా? ఇస్తే మళ్లీ గెలుస్తారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.

మల్లారెడ్డికి ఫస్ట్ ర్యాంక్

భూ వివాదాల్లో మంత్రి మల్లారెడ్డి ఇరుక్కోవడం సహజమని, ఇందులో ఆయనకు ఫస్ట్ ర్యాంకు వస్తుందని బీఆర్ఎస్ లీడర్లే సెటైర్లు వేస్తుంటారు. మల్లారెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పలు భూ వివాదాల్లో చిక్కుకున్నారు. సూరారంలోని మల్లారెడ్డి విద్యా సంస్థలకు పక్కనే ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు మంత్రిపై కేసు పెట్టమని ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జవహర్‌నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆస్పత్రి నిర్మించినట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు మార్లు ఆరోపణలు చేశారు. మంత్రి బావమరిది తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలొచ్చాయి. తన నియోజకవర్గంలో వెంచర్లు వేస్తే తనకు వాటా ఇవ్వాలని స్వయంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

కేటీఆర్ ఫామ్ హౌజ్ వివాదం

మంత్రి కేటీఆర్‌కు జన్వాడలో ఫామ్ హౌజ్ ఉందని, అక్కడున్న నాలాను కబ్జా చేసి ఆయన దాన్ని నిర్మించినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద పోరాటమే చేశారు. గ్రీన్ ట్రిబ్యూనల్‌ను అశ్రయించగా, విచారణ చేసేందుకు ట్రిబ్యూనల్ ఓ కమిటీ వేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

కబ్జా ఆరోపణల్లో నిరంజన్

అలంపూర్ సమీపంలో మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి, ఫామ్‌హౌజ్ నిర్మించినట్టు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నదితో పాటు ఆర్‌డీఎస్ ప్రాజెక్టు, అసైన్డ్ భూములను కబ్జా చేశారని విమర్శలు చేశారు. అయితే ఆ ఫామ్ హౌజ్‌కు వెళ్లేందుకు ట్రైబల్ నిధులతో రోడ్డు వేసేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ జీవో ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.

శ్రీనివాస్ గౌడ్ సన్నిహితుల దందాలు

జడ్చర్ల, మహబూబ్‌నగర్, భూత్పూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్నిహితులే అందులో కీలకంగా ఉన్నట్టు బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఆరోపణలు చేశారు. మంత్రి ప్రోద్బలంతోనే వారు సెటిల్‌మెంట్లు చేయడం, మాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

తలసాని కొడుకుపై కేసు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ ఓ భూ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో సాయి కిరణ్ పై కేసు నమోదైంది. ఏపీకి చెందిన లీడర్ కొత్తపల్లి గీతకు చెందిన వ్యక్తుల భూ వివాదాన్ని సెటిల్ చేసే సమయంలో కిరణ్ వారిని బెదిరించడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణ..

ఖమ్మంలో ఓ మంత్రికి చెందిన మెడికల్ కాలేజీ పక్కన కెనాల్ భూములున్నాయి. వాటిని ఆక్రమించి కాలేజీ ప్రహరీ గోడ నిర్మించినట్టు ఆరోపణలొన్నాయి. అయితే ఆక్రమించిన భూములను రెగ్యూలరైజ్ చేస్తామని హామీ మేరకు సదరు మంత్రి అప్పట్లో గులాబీ పార్టీలో చేరినట్టు పుకార్లు షికార్లు చేశాయి.

ఆ మంత్రి సన్నిహితుల ఆగడాలు

కేబినెట్‌లోని ఓ మంత్రి సన్నిహితులు శ్రీరాం సాగర్ ముంపు గ్రామాల భూ వివాదాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. సదరు మంత్రి అండదండలతో ముంపు గ్రామాల రైతులకు పునరావాసం కింద ప్రభుత్వం నుంచి భూములు ఇప్పిస్తున్నారని, అయితే పరిహారం కింద వచ్చిన భూమిని తమకు తక్కువ ధరకే విక్రయించాలని వారితో ఒప్పందం చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. సిటీ శివారులోని ఫారెస్ట్ లాండ్‌ను మంత్రి సన్నిహిత బంధువు కబ్జా చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.

మంత్రి కేరాఫ్ మియాపూర్

గత ప్రభుత్వంలో ఆ మంత్రి కీలక శాఖ చూశారు. ఆ సమయంలో సిటీలోని అత్యంత ఖరీదైన మియాపూర్‌లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు సదరు మంత్రి సహకరించినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో పెద్ద రాజకీయ దూమారమే రేగింది.

మంత్రి భూముల కోసం కలెక్టరేట్

సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణంపై అప్పట్లో రాజకీయ దుమారమే రేగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రికి చెందిన భూములకు డిమాండ్ రావాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతాన్ని ఎంపిక చేశారని విమర్శలొచ్చాయి. దీనిపై స్థానికంగా ఆందోళనలు కూడా జరిగాయి.

ఆ మంత్రి సన్నిహితుల దందాలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రం పరిసరాల్లో ఓ మంత్రి సన్నిహితుల అరాచకాలు ఎక్కువగా ఉన్నట్టు విమర్శలు ఉన్నాయి. మంత్రికి చెందిన ఓ బంధువు ఆస్పత్రి నిర్మాణం కోసం విలువైన భూమిని తక్కువ ధరకు విక్రయించాలని ఒత్తిడి పెడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.

మంత్రి అండతో ఇష్టానుసారంగా మైనింగ్

ఓ మంత్రి ఫ్యామిలీ మెంబర్లు మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నారు. ఆయన అండ చూసుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తున్నట్టు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అనుమతి లేని భూముల్లోనూ మైనింగ్ చేస్తున్నా పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed