ఈడీ ఉచ్చులో ఎమ్మెల్సీ కవిత? మరోసారి Delhi Liquor Scam కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-17 02:53:36.0  )
ఈడీ ఉచ్చులో ఎమ్మెల్సీ కవిత? మరోసారి Delhi Liquor Scam కలకలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం మరోమారు కాకరేపుతున్నది. హైదరాబాద్​ లోని అనేక ప్రాంతాంలో ఈడీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వారం రోజుల క్రితం ఇదే కేసుకు సంబంధించి ఈడీ బృందాలు నలుగురి నివాసాల్లో, వారు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లో సోదాలు చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు రెయిడ్ చేశాయి. 18 కంపెనీలకు, అందులో డైరెక్టర్లుగా పనిచేస్తున్న 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ కవితకు పర్సనల్ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. అనేక ప్రాంతాల్లో సాయంత్రానికే తనిఖీలు ముగిసినా బుచ్చిబాబు ఆఫీసులో మాత్రం రాత్రి వరకూ కంటిన్యూ అయింది. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడిగా పేరున్న, గతంలో ఒక కంపెనీలో సహ డైరెక్టర్‌గా ఉన్న సృజన్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు గత వారం సోదాలు నిర్వహించారు. ఇప్పుడు ఆమెకు చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులోనూ సోదాలు చేశారు. దోమల్‌గూడలోని సాయికృష్ణ అపార్టుమెంటులో గోరంట్ల అసోసియేట్స్ పేరుతో నడుస్తున్న కంపెనీలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. మరో మూడు కంపెనీల్లో ఆయన డైరెక్టర్‌గా, అదనపు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై గతంలో కవితతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర దిగిన ఫోటో కలకలం రేపింది. ఇదే కేసులో గత వారం ఈడీ బోయిన్‌పల్లి అభిషేక్ నివాసంలోనూ సోదాలు నిర్వహించింది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో అభిషేక్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కవితతోనూ పరోక్షంగా ఇలాంటి వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉండే అవకాశం ఉందంటూ గతంలో ఊహాగానాలు వచ్చాయి. కవిత చుట్టూ ఉన్నవారికి ఈడీ నోటీసులు జారీచేయడం, వారి ఇండ్లలో సోదాలు నిర్వహించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకూ శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ స్వయంగా ఆమె తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మొత్తం పన్నెండు మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు వార్తలు వచ్చినా 11 మంది పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కానీ పన్నెండవ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మిగిలిపోయింది.

పొరుగు రాష్ట్రాల్లోనూ..

ఢిల్లీ నగరంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ బృందాలు శుక్రవారం సోదాలు నిర్వహించినా, పలువురికి, పలు కంపెనీలకు నోటీసులు జారీచేసినా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో లేనివారి ఇండ్లలోనూ ఈడీ సోదాలు జరపడం గమనార్హం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై నివాసంలో, ఆయన డైరెక్టర్‌గా ఉన్నరాబిన్ డిస్టిల్లరీ, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీల్లో గత వారం ఈడీ సోదాలు చేసింది. మళ్లీ ఇప్పుడు రెండోసారి చేపట్టింది. ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేని వ్యక్తులు, కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టింది. మాదాపూర్‌లోని అనూస్ బ్యూటీపార్లర్‌లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి బీజేపీ ఎంపీలు రెండు రోజుల క్రితం స్టింగ్ ఆపరేషన్ చేసిన వీడియోలను మీడియాకు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు జరగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డికి చెందిన ఢిల్లీలోని, నెల్లూరులోని నివాసాల్లో సైతం సోదాలు జరిగాయి. మొత్తం 18 కంపెనీలకు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో మాగుంటకు చెందిన కంపెనీ కూడా ఉన్నది. సెర్చ్ వారెంట్లు తీసుకున్న తర్వాతనే ఈ సోదాలు జరిపినట్లు తెలిసింది.

నోటీసులు అందుకున్నది వీరే!

అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు, చందన్ రెడ్డి, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేశ్​ అరోరా, వై శశికళ, మాగుంట రాఘవలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మొత్తం పన్నెండు మందికి అని వార్తలు వస్తున్నా 11 మంది పేర్లు మాత్రమే వెలుగులోకి రావడంతో పన్నెండవ వ్యక్తి ఎవరనే చర్చ జరుగుతున్నది. వీరితో పాటు ఇండో స్పిరిట్స్, మాగుంట అగ్రో ఫామ్స్, ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గానామిక్స్ ఈకోసిస్టమ్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్, ప్రీమీస్ ఎంటర్‌ప్రైజెస్, జైనాబ్ ట్రేడింగ్ ప్రై లిమిటెడ్, బాలాజీ డిస్టిల్లరీస్, టెక్రా పెరల్ డిస్టిల్లరీస్, హివిడే ఎంటర్‌ప్రైజెస్, వైకింగ్ ఎంటర్‌ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్‌ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్‌ప్రైజెస్, పెగాసస్ ఎంటర్‌ప్రైజెస్, రాబిన్ డిస్టిల్లరీస్ అనే కంపెనీలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఉస్మానియా బిస్కెట్లు.. ఆ టేస్ట్‌తో అందరికీ ఫేవరేట్

Advertisement

Next Story