దయచేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయండి.. సోనియా గాంధీకి MLC కవిత లేఖ

by GSrikanth |   ( Updated:2024-02-19 06:59:16.0  )
దయచేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయండి.. సోనియా గాంధీకి MLC కవిత లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఈ విషయాన్ని స్వయంగా కవిత సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్మి ప్రజలు, విద్యార్థులు అధికారం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 41,56 జారీ చేసింది. ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా అలాగే కచ్చితంగా అమలు చేసే పద్దతి నడుస్తోంది.

అయితే, ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 41,56 జీవోలను రద్దు చేస్తూ ఈ నెల 10వ తేదీన మరో జీవో తెచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. తాము మహిళల హక్కులు హరించబోమని 2023 జనవరిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరినీ సంప్రదించకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది.

దాంతో మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి జీవో నెంబర్ 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగ అవకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తిగా తెలంగాణలో మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలి. జోక్యం చేసుకొని వెంటనే జీవోను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed