- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC Elections: ఓట్ ఫర్ సేల్..! అంగట్లో సరుకుల్లా ఉపాధ్యాయుల ఓట్లు?

దిశ, నల్లగొండ బ్యూరో: సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపకాలు జరగడం సహజం. ఎందుకంటే అక్కడ అన్ని రకాల ప్రజల ఓట్లు ఉంటాయి. ఎక్కువగా నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత ప్రజల ఓట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రలోభాలకు లొంగడం సహజమే. కానీ, ప్రస్తుతం జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజానికి మార్గనిర్దేశం చేసి ఉపాధ్యాయుల ఓట్లు కూడా అంగట్లో సరుకుల్లా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొనడానికి అభ్యర్థులు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని 12 విభజన జిల్లాలలో 191 మండలాలకు ఉపాధ్యాయ ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 24,905 ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 14,940 మహిళలు 9,965 మంది ఓటర్లు ఉన్నారు. వీరి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 200 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట 163, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5,904, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8,041మంది ఓటర్లు ఉన్నారు.
ఓటుకు రూ.4 వేల నుంచి 6 వేలు..!
సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉంది. కానీ, నేడు వారే అంగట్లో సరుకులుగా మారిపోయారు. నోట్లు ఇస్తే తప్ప ఓట్లు వేయలేని దుస్థితికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అందులో కేవలం ఐదుగురు అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అందులో ఓ ప్రధాన పార్టీ అండదండలతో ఉపాధ్యాయ సంఘం పేరుతో బరిలో ఉన్న అభ్యర్థి ఓటుకు రూ.4 వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ అభ్యర్థి గెలుపుకు రంగంలోకి దిగిన ఓ సంస్థ తన కార్యకర్తల చేత ఉపాధ్యాయుల వివరాలు ఫోన్ నెంబర్లు సేకరించి శివరాత్రి రోజున డబ్బు పంపిణీకి పూర్తి ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతి రెండు ఓట్లకు ఒక కార్యకర్తను నియమించినట్లు వినికిడి.
ఇదిలా ఉంటే మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి ఓటుకు రూ.5 వేల నుంచి 6 వేల వరకు అందజేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రూ.20 కోట్లకు పైగా ఎన్నికలలో ఖర్చు పెట్టి ఎలాగైనా ఎమ్మెల్సీగా గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో అభ్యర్థి అధికార పార్టీ అండదండలు తనకే ఉన్నాయని ఒక వైపు చెబుతూనే డబ్బు పంపిణీకి నోట్ల కట్టలు ప్రతి జిల్లాకు ఇప్పటికే చేరవేసినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. మరొక అభ్యర్థి తనకు ఉపాధ్యాయ రంగంలో పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీకి సిద్ధమైనట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు డబ్బు పంచడమే కాకుండా మద్యం పంపిణీ కూడా సద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మద్యాన్ని డంప్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.