గంగుల కమలాకర్‌ ...చౌకబారు మాటలు బంద్‌ చెయ్ : ఎమ్మెల్యే విజయ రమణారావు

by M.Rajitha |
గంగుల కమలాకర్‌ ...చౌకబారు మాటలు బంద్‌ చెయ్ : ఎమ్మెల్యే విజయ రమణారావు
X

దిశ, వెబ్ డెస్క్ : గంగుల కమలాకర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీలో మాట్లాడుతూ... మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్‌ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం కట్టింది, కూలింది బీఆర్ఎస్ హయంలోనే అనే సోయి లేకుండా విమర్శలు చేస్తుండని మండిపడ్డారు. స్వయంగా వాళ్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాళేశ్వరం పోయి సెల్ఫీలు దిగి గొప్పలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిలువ చేయొద్దని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పిన విషయం బీఆర్‌ఎస్‌ నేతలకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లు అడ్డంగా దోచి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పులిచింతల, నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లిలాంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్నారు. ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. శ్రీరాంసాగర్‌లో ఇప్పటికే 40టీఎంసీలు నీళ్లు వచ్చాయని, మరో 35టీఎంసీల నీళ్లు వస్తే దిగువననున్న అన్ని ప్రాజెక్టులు నిండుతాయన్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల మరో 2, 3 రోజుల్లో గోదావరికి పెద్ద ఎత్తున వరద రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. గతంలో కన్నెపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ సముద్రంలోకి వదిలారన్నారు. ఇంజనీర్ల సూచనల మేరకే తమ ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మల్లన్నసాగర్‌ కోసం మామ, అల్లుడు కరీంనగర్‌ పొట్టకొట్టారన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి.. మళ్లీ 40 టీఎంసీలు సముద్రంలోకి వదలడం విచిత్రంగా ఉన్నదన్నారు.

Next Story

Most Viewed