నిబంధనలు సరిగా లేవు.. ఎంబీబీఎస్ సీట్లపై హరీష్ రావు స్పందన

by Gantepaka Srikanth |
నిబంధనలు సరిగా లేవు.. ఎంబీబీఎస్ సీట్లపై హరీష్ రావు స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు సరిగా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనల వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లలే.. స్థానికేతరులుగా మారే అవకాశం ఉందని అన్నారు. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని గుర్తుచేశారు. ఇదే పద్ధతిని విద్య విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోని లోకల్ రిజర్వేషన్లలోనూ సవరణలు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో స్థానికేతర విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయలేదని అన్నారు.

మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంలోనూ సరిగా అవగాహన లేదని అన్నారు. కాగా, 9వ తరగతి నుంచి 12 వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ గతంలోనే జీవో (నెం.114) జారీ చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా గుర్తు చేశారు. 2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవో నెం.114లోని 9వ తరగతి నుంచి 12 వరకు చదివిన వారిని స్థానికులుగానే పరిగణించే విధానాన్ని తాము కూడా అమలు చేస్తున్నామని, ఈ జీవోలోని నిబంధననే జీవో నెం.33లోనూ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed