Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు

by Rani Yarlagadda |
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్ డెస్క్: కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఊరు, వాడ ఉన్న ఆలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ.. శివదర్శనంతో భక్తులు పునీతులవుతున్నారు.

పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) బ్రాహ్మీ ముహూర్తంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివుని సేవలో తరించారు. దేవాలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి సురేఖ అర్చకుల వేదమంత్రాల నడుమ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. మహాశివునికి స్వహస్తాలతో హారతినిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖ గారిని శాలువాతో సత్కరించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆలయ విశిష్టతను నిర్వాహకులు మంత్రి సురేఖ గారికి వివరించారు. దేవాలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున తనవంతు సహకారం అందిస్తామని మంత్రి సురేఖ నిర్వాహకులకు హామీ ఇచ్చారు.

కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామికి మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానంజనేయు స్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar). ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయస్వామి ఆశీర్వచనం అందరిపై ఉండాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆపదలో రక్షించే భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని దేవుడిని ప్రార్థించారు.

Advertisement

Next Story

Most Viewed