రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక హామీ

by GSrikanth |
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు ఆశిస్తున్న అంశాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తే సహించేది లేదని, గత ప్రభుత్వం చేసిన పనులపై సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించామని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రత్యేక ప్రకటనను రిలీజ్ చేశారు. పార దర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు కృషి చేస్తున్నామన్నారు. పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు.

గత నెల రోజులుగా నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల పనితీరును అంచనా వేసేందుకు పలు సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నష్టం తదితర అంశాలపై సమీక్షించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చామన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు, మీడియాకు తెలియజేశామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామని వివరించారు.

ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖను కలిసి విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి తాను ఢిల్లీకి వెళ్లామన్నారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు గత బీఆర్‌ఎస్‌ పాలనలో లోపం వలన పౌర సరఫరాల శాఖ రూ.58 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు.బీఆర్‌ఎస్ పాలన ద్వారా పేదలకు సరఫరా చేయబడిన బియ్యం కిలో రూ.39 వెచ్చిస్తున్నప్పటికీ 70 శాతానికి పైగా బియ్యం నేరుగా వినియోగించడం లేదని, కిలో రూ.5కే ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని, వీటిని ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed