Uttam Kumar Reddy : రుణమాఫీ కాని రైతులకు క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ramesh N |
Uttam Kumar Reddy : రుణమాఫీ కాని రైతులకు క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి.. జూలైలోనే మొదలు పెట్టామన్నారు. సోమవారం ఎర్రమంజిల్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున్న చేశారని వెల్లడించారు. నాడు దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసిందన్నారు. నేడు తెలంగాణలో కూడా అంతటి విప్లవాన్ని రైతుల్లో తీసుకురావడానికి, రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన అడుగు వేశామన్నారు. దీనిని మెచ్చుకోక పోగ ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు.

రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు ఆపై మొత్తం కడితే రుణమాఫీ అవుతుందన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్‌ నెంబర్లు, 4.83 లక్షల మంది రేషన్‌‌కార్డుల్లో తప్పులున్నాయని, వారి సమస్యలను పరిష్కరించి త్వరలోనే వారికి రుణ మాఫీ చేస్తామన్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగని వారికి రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా చేస్తుందన్నారు. రుణమాఫీ అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిన వారికి అన్ని మండల కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. రేషన్ కార్డు ప్రాబ్లమ్ ఉన్నా.. పాస్ బుక్ ప్రాబ్లమ్ ఉన్నా.. ఆధార్ కార్డు ప్రాబ్లమ్ ఉన్నా.. వివరాలు తీసుకుని పరిష్కరించి.. రుణమాఫీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగితే రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండ గాలికి వదిలేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ మొదలు పెట్టారని చెప్పారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నట్లు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తే మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వంలో వారి ధాన్యం కొనుగోలు డబ్బులు రావాలంటే వారానికి పైగా సమయం పట్టేదన్నారు.

Read More..

రూ.500 బోనస్‌పై మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Advertisement

Next Story

Most Viewed