- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేషన్ కార్డు అవసరం లేదు.. నొక్కి చెప్పిన మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల్లోపు పంట రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం 22,37,848 ఖాతాలకు రూ. 17,933.19 కోట్ల మేర మాఫీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 42 లక్షల ఖాతాలకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నా రుణాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇవి కాక ఆధార్ కార్డ్ నెంబరు తప్పుగా నమోదైన ఖాతాలు, పంట రుణాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువ వున్న ఖాతాలు కూడా మరికొన్ని ఉన్నాయన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం రెండు లక్షల రూపాయను సీలింగ్‌గా విధించినందున దానికంటే పైబడిన రుణాన్ని బ్యాంకులకు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం (ఆ రెండు లక్షలను) మాఫీ చేస్తుందని వివరించారు. రుణమాఫీ పథకానికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలలో ప్రభుత్వం జీవో (నెం. 567) ద్వారా స్పష్టత ఇచ్చిందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు.
ఏదేని కారణాల వల్ల రెండు లక్షల్లోపు రుణం ఉన్నా మాఫీ కానీ ఖాతాదారులుంటే (రైతులు) ఆ వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ (12 డిసెంబర్ 2018 నుండి 09 డిసెంబర్ 2023) వరకు తీసుకున్న పంట రుణాల వివరాలన్నింటినీ తెప్పించామని పేర్కొన్నారు. రుణమాఫీకి రేషను కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని మంత్రి మరోసారి నొక్కిచెప్పారు. రెండు లక్షల రూపాయలలోపు రుణాలు ఉండి రేషన్ కార్డు లేనివారు లేదా ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైనవారు లేదా ఇతర కారణాలతో రుణమాఫీ పొందకుంటే సమీపంలోని వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.
తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపచేస్తామని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఈ విషయాన్ని స్పష్టం చేసి తగిన ఆదేశాలు ఇచ్చామని గుర్తుచేశారు. మండల పరిధిలోని అన్ని బ్యాంకు బ్రాంచీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు సంబంధించిన సమస్యాత్మక ఖాతాలకు బాధ్యత ఆ మండల వ్యవసాయ అధికారిదేనని పేర్కొన్నారు. నిర్ధారణ కోసం మండల వ్యవసాయాధికారి ఫీల్డుకె ఖాతాదారుల, వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఆధార్ కార్డు వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. రుణఖాతాలో నమోదైన పేరు, ఆధార్‌లో పేరుతో టాలీ కాకుంటే ఖాతాదారుల నుంచి సరైన వివరాలు సేకరించి పోర్టల్‌లోకి ఎక్కిస్తారని తెలిపారు. బ్యాంకు సమర్పించే ‘అసలు’, వడ్డీలో తేడా ఉన్నా వ్యవసాయాధికారికి ఖాతాదారులు తెలియజేయాలన్నారు. ప్రతీ జిల్లా వ్యవసాయాధికారి రోజువారీ ఫిర్యాదులను సాయంత్రంకల్లా అగ్రికల్చర్ డైరెక్టర్‌కు పంపిస్తారని తెలిపారు.
కొన్ని బ్యాంకుల నుండి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80,000 ఖాతాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నామని, ఆధార్ నెంబర్లు సమర్పించకపోవడం, రుణాల మంజూరీ తేదీలలో తప్పులుండడం తదితర కారణాలతో పరిష్కరించడానికి రాష్ట్రస్థాయిలో అధికారుల బృందం చర్యలు తీసుకొంటున్నదన్నారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి రూ. 44.95 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసిన మూడు రోజుల్లోనే లక్ష రూపాయల్లోపు పంట రుణాలను ఫస్ట్ ఫేజ్‌లో 11,50,193 రైతు ఖాతాల్లో రూ. 6,098.93 కోట్లను, రెండో విడతలో లక్షన్నర రూపాయల్లోపు రుణాలను 6,40,823 ఖాతాల్లో రూ. 6,190 కోట్లను, థర్డ్ ఫేజ్‌లో రెండు లక్షల రూపాయల్లోపు రుణాలను 4,46,832 ఖాతాల్లో రూ. 5,644 కోట్ల మేర జమ చేసి రైతుల్ని రుణవిముక్తుల్ని చేశామన్నారు. మొత్తంగా మూడు విడతల్లో 22,37,848 రైతు ఖాతాలకు రూ. 17,933 కోట్లను విడుదల చేసి మాట ఇచ్చిన ప్రకారం పంద్రాగస్టు లోపే అమలు చేశామన్నారు.
అధికారం చేపట్టిన మొదటి పంట సీజన్‌లోనే రైతుల సంక్షేమానికి రూ. 26,140 కోట్లను ఖర్చు చేశామని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం రైతుబంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ పామ్ రైతులకు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల వివరించారు.