Minister Sridhar Babu: నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి: మంత్రి శ్రీధర్‌బాబు మాస్ వార్నింగ్

by Shiva |
Minister Sridhar Babu: నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి: మంత్రి శ్రీధర్‌బాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎంపికపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ పదవా.. సిగ్గు సిగ్గు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మరోవైపు ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఏంటని గులాబీ లీడర్లు స్పీకర్‌ పాత్రపై బహిరంగంగా మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు ఆయన కౌంటర్ ఇచ్చారు. శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ నియామకం జరిగిందని స్పష్టం చేశారు. సభాపతిని అవమానించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థలను గౌరవించాల్సిందేనని అన్నారు. ఓ ప్రక్రియ ప్రకారమే అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గుడుస్తున్నా.. బీఆర్ఎస్ నేతల తీరు ఏ మాత్రం మారడం లేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్రీధర్‌బాబు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story