పేదలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యం: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు

by karthikeya |   ( Updated:2024-10-11 08:30:03.0  )
పేదలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యం: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్‌ను తీసుకొస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దానికోసమే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూలును రూ.250 నుండి రూ.300 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శుక్రవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదట స్కూల్ భవనాలకు ఎంపీ వంశీ కృష్ణతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి.. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. పేదబిడ్డలకు సైతం మెరుగైన, నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్‌లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వం తిరిగి గాడిన పెడుతోందని, రాష్ట్రంలో మార్పు తీసుకొస్తోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపించామని, డీఎస్సీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

Advertisement

Next Story