మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌‌కు గట్టి కౌంట‌ర్ ఇచ్చిన సీతక్క

by Mahesh |
మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌‌కు గట్టి కౌంట‌ర్ ఇచ్చిన సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ తీరు హంత‌కులే సంతాపం ప‌లికిన‌ట్టు ఉందని మండిపడ్డారు. ట్విట్టర్ లో కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. ‘మీ పాలనలో పంచాయ‌తీల‌కు నిధులు, సర్పంచ్ ల‌కు బిల్లులు ఏళ్ల తరబడి చెల్లింపుల‌కు నోచుకోలేదు... అన్ని శాఖ‌ల్లో క‌లిసి 72 వేల కోట్ల పెండింగ్ బిల్లుల‌ను వార‌స‌త్వంగా వదిలిపోయారు... ఆ పాపాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం మోయాల్సి వ‌స్తుంది... మీ అస్థవ్యవ‌స్థ పాల‌న తో ప‌ల్లెల‌ను నిర్లక్షం చేసి ఊప‌ర్ షేర్వాణి, అంద‌ర్ ప‌రేషానిలాగా మార్చారు.’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు విష జ్వరాలతో ఏజెన్సీ పల్లెలు ఇబ్బందులు పడినా, కనీసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయలేదన్నారు. విష జ్వరాల‌తో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నెలరోజుల్లోనే 42 మంది మృతి అని క‌థ‌నాలు ప‌త్రిక‌ల్లో ఏనాడు ప‌ట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాల‌న‌లో ఊర్లకు ఊర్లే విష‌జ్వరాల బారిన ప‌డిన సంగ‌తిని మ‌ర్చిపోయారా? అని నిలదీశారు. పారిశుధ్య, డ్రైనేజీ నిర్వహణ, దోమల మందుకు, బ్లీచింగ్ పౌడ‌ర్ కు ఎక్కడా నిధుల కొర‌త లేదని స్పష్టం చేశారు. ‘20 నెల‌లుగా రాష్ట్ర ఆర్దిక సంస్థ నిధులు అంద‌లేద‌ని అంత పెద్ద అక్షరాల‌తో మీరు ట్వీట్ చేసిన ప‌త్రిక‌లో రాస్తే..దాన్ని 8 నెల‌లుగా రాష్ట్ర ఆర్దిక సంస్థ నిధులు ఇవ్వలేద‌ని ప‌చ్చి అబ‌ద్దాల‌ను చెప్పడం మీకే చెల్లింది. మీ పాపాన్ని మా ఖాతాలో వేయాల‌ని చూడ‌టం మీ దిగ‌జారిన రాజ‌కీయానికి ప‌రాకాష్ట. 15వ ఆర్దిక సంఘం నిధులు, ప్రత్యేక గ్రాంట్లను పంచాయ‌తీల అవ‌స‌రానికి అనుగుణంగా స‌ర్దుబాటు చేస్తున్నాం అన్నారు. గ్రామ పంచాయ‌తీల‌ను సంక్షోభంలో నెట్టి, ఎంద‌రో స‌ర్పంచ్ ల ఉసురు తీసిన మీకు, ఇప్పుడు వారి ప‌ట్ల సానుభూతి వ‌చ‌నాలు ప‌లికే నైతిక అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఒకసారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలన్నారు.

చేసిన ప‌నుల‌కు బిల్లులు రాక సిరిసిల్ల లోని ఇల్లంత కుంట మండలం, సోమారంపేట స‌ర్పంచ్ వ‌డ్డే ఆనంద‌రెడ్డి ఆత్మహ‌త్య చేసుకున్నప్పుడు మౌనంగా ఉన్న కేటీఆర్ కు మాట్లాడే హ‌క్కు ఉందా? అని నిలదీశారు. ఇక‌ ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేస్తే నిధులెక్కడికి పోయాయి? ప‌ల్లెలు అభివృద్దికి ఎందుకు నోచుకోలేకపోయాయి? ఆ చేయితో ఇస్తూ ఈ చేయితో పంచాయితీల నిధులు కాజేసిన గ‌తం మీ ప్రభుత్వానిది అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. స‌ర్పంచ్ ల‌కు తెలియ‌కుండానే కేంద్ర నిధుల‌ను దొంగ చాటుగా దారి మ‌ల్లించిన చ‌రిత్ర బీఆర్ఎస్ ది అన్నారు. ట్విట్టర్ లో ఎంత మొత్తుకున్నా ప్రజ‌లు వినే ప‌రిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బుర‌ద‌చ‌ల్లడం మానుకుని, గ్రామ స్వరాజ్యం పున‌ర్నిర్మాణానికి స‌హ‌క‌రించాలని సూచించారు.

Advertisement

Next Story