Seethakka: కేసీఆర్, కేటీఆర్ వల్లే ఇదంతా.. లబ్ధిదారుల ఎంపికపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Seethakka: కేసీఆర్, కేటీఆర్ వల్లే ఇదంతా.. లబ్ధిదారుల ఎంపికపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు.. అందుకే ఉద్దేశ పూర్వకంగా గులాబీ పార్టీ గొడవలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మంత్రి చిట్ చాట్ నిర్వహిచారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉంది. ఏ ఒక్కరూ నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని గ్రామ సభల్లో కూడా మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ చేత కాని పాలన వల్లే సమస్యలు వస్తున్నాయని పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. మంచి నీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం బీఆర్ఎస్ కు అలవాటే అని విమర్శించారు.

నాడు ఫామ్ హౌస్ లో లబ్ధిదారుల ఎంపిక:

నిన్న రాష్ట్రం మొత్తం 3,410 గ్రామాల్లో గ్రామసభలు (Grama Sabha) జరిగితే కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ అనుకూల పత్రికలోనే రాశారని అది కూడా బీఆర్ఎస్ (BRS) నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆందోళనలేనన్నారు. 96 శాతం గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగిందన్నారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే పథకాలు వచ్చేవి. ఫామ్ హౌస్ లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ మా ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగున్నదన్నారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారు కానీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నా కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలప్పుడే అరకొరగా పథకాలు ఇచ్చేవారని కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో ప్రజా అవసరాలు, ఆర్థిక వనరులను బట్టి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదని బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకేసారి అమాంతం పైకి రాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా? ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి, ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందన్నారు.

Next Story

Most Viewed