Caste Census: ఇష్టముంటేనే వివరాలు చెప్పండి : కులగణనపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-11 03:16:49.0  )
Caste Census: ఇష్టముంటేనే వివరాలు చెప్పండి : కులగణనపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్:ప్రజలకు ఇష్టం ఉంటేనే కులం, ఆధార్ వివరాలు వెల్లడించవచ్చని, అందుకు అనుగుణంగానే ఎన్యూమరేటర్లు వివరాలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని (Vemulawada Temple) దర్శించుకున్నారు. స్వామివారికి గోపూజ చేసి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టేలా చేయట్లేదని, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైన సర్వే కాదని తెలిపారు. ప్రజలను బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డు వివరాలు అడగట్లేదన్నారు. ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రభావితం కావొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.

కులగణన సర్వే.. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సర్వే అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతున్న కేటీఆర్ (KTR) కు అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేటీఆర్.. తమ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, ప్రతిపక్ష పదవి బీసీలకు, ఎస్సీలకు ఇస్తే.. బీసీల గురించి మాట్లాడే అర్హత పొందుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో బీసీలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జీఓ నంబర్ 18 ద్వారా.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సమాచారాన్ని సేకరించి, అసమానతల్ని తొలగించి అన్నివర్గాల వారికి సమాన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Advertisement

Next Story