Ponnam Prabhakar: నయీం కుటుంబ వివరాలు నమోదు చేసిన మంత్రి

by Gantepaka Srikanth |
Ponnam Prabhakar: నయీం కుటుంబ వివరాలు నమోదు చేసిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మహ్మద్ నయీం(Mohammed Naeem) కుటుంబ సభ్యుల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నమోదు చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎన్‌క్లేవ్ అపార్ట్మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి మంత్రి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి వివరాలు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి సర్వే ప్రారంభం అయిందని తెలిపారు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సర్వే దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం సర్వే పూర్తైందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4 లక్షల 50 వేల పైగా ఇళ్లకు సర్వే జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 85 వేలకు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారని వెల్లడించారు.

సర్వే విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఎక్కడా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి.. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. సమాచారం గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడగడం లేదు.. అకౌంట్ ఉందా? లేదా? అని మాత్రమే తెలుసుకుంటున్నారని అన్నారు. ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అందరూ సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు జిల్లా కలెక్టర్‌లను సంప్రదించాలని.. వారు మీ అనుమానాలు నివృత్తి చేస్తారని అన్నారు.

Advertisement

Next Story