అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారుల(Revenue officers)కు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తహశీల్దార్ల(Tahsildars)తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాన్యులకు మేలు చేసేలా రాష్ట్ర రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా? లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తహశీల్దార్లకు, రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి సూచించారు.

రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేదసామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. విధి విధానాలు రూపొందిస్తుందన్నారు. దానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు పని చేయాలన్నారు. ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే కసరత్తు చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడంలో రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని మంత్రి అన్నారు.

Advertisement

Next Story