- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha: హంగు, ఆర్భాటాలే తప్ప వారి బాధలు పట్టించుకోలేదు
దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరి గుట్ట టెంపుల్(Yadadri Temple) డెవలప్ మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు వివరాలను కచ్చితత్వంతో అందజేయాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన అభివృద్ధి పనులు సామాన్య భక్తులకు ఊరటనిచ్చాయన్నారు. బుధవారం సచివాలయంలోని దేవాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైటీడీఏ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైటీడీఏ ఏర్పాటు, చేపట్టిన పనులు, భూసేకరణ, గత ప్రభుత్వ పాలనలో అర్థాంతరం నిలిచిన అభివృద్ధి పనులు, అందుకు గల కారణాలను వైస్ చైర్మన్ కిషన్ రావును అడిగి తెలుసుకున్నారు. అసమగ్ర సమాచారంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, డీపీఆర్ల సమర్పణ, బిల్లుల చెల్లింపు, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈనెల 7లోగా అందజేయాలని వైస్ చైర్మన్‌ను ఆదేశించారు. ప్రస్తుతం వైటీడీఏ పరిధిలోని భూమి, కలెక్టర్ నుంచి భూసేకరణకు రావాల్సిన అనుమతులు, రోడ్లు, హెలిప్యాడ్ నిర్మాణానికి సేకరించిన భూమి, భూ బదలాయింపు తదితర వివరాలపైనా ఆరా తీశారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యాదగిరి గుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రికి వివరించారు. దాదాపు 1000 మంది భక్తులు కొండపై నిద్రించేందుకు వీలుగా డార్మెటరీ హాలు నిర్మాణం, ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించడంతో 300 మంది ఆటో కార్మికులకు జీవనభృతి కలిగిందన్నారు. భక్తులకు అనుగుణంగా ప్రసాదం కౌంటర్ల పెంపు, ప్రత్యేక దర్శనం క్యూలైన్ వద్ద నీడ కోసం షెడ్డూ ఏర్పాటు, పాలిచ్చే తల్లుల కోసం ఆలయ ప్రాంగణంలో, వ్రత మండపం వద్ద ప్రత్యేకంగా లాక్టేషన్ గదులు, కొండ పైన ప్రత్యేకంగా టాయిలెట్స్, విశేష సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. కళావేదికలో ప్రతి శుక్ర, శనివారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు వేసవిలో ఇబ్బందులు పడకుండా నీడలో సేదతీరడానికి 23,000 స్క్వేర్ ఫీట్‌లో జర్మన్ హంగర్స్ (షెడ్)ల ఏర్పాటు, ప్రతి రోజు 1000 మంది భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. నూతన అన్నప్రసాద భవన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రతి రోజు 2000 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురం, దేవాలయ పునర్నిర్మాణం తర్వాత నిలిచిపోయిన తీర్థం, శఠగోపాల పునరుద్ధరణ వంటి ఎన్నో పనులను చేపట్టినట్లు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హంగు, ఆర్భాటాలకు పోయిందే తప్ప, సామాన్య భక్తులు దైవదర్శన సమయంలో ఎదుర్కొంటున్న కష్టాలను అసలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓ వైపు యాదగిరి గుట్ట క్షేత్ర ప్రాశస్త్యం ఇనుమడించేలా, స్వామివారి మహాత్మ్యాన్ని చాటేలా చర్యలు చేపడుతూనే, మరోవైపు సామాన్య భక్తులకు కనీస సౌకర్యాల కల్పనకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని వెల్లడించారు. యాదాద్రిని వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతామని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతు కొండిబా, అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, జ్యోతి, ఆర్జేసీ రామకృష్ణారావు, వైటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.