గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి(Yadadri Lakshmi Narasimhaswamy) దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) నిర్వహించిన వరుస సమీక్షలు, సమావేశాలు సత్ఫలితాలనిచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చొరవతో దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుమతి ఇచ్చారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను M/s స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులను బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోపే పూర్తి చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

ఈ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకుగాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ చైర్ పర్సన్‌గా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డైరక్టర్ కన్వీనర్‌గా, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సలహాదారు, వైటీడీఏ వైస్ ఛైర్మన్ జీ.కిషన్ రావు, యాదగిరి గుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలివ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బంగారు తాపడం పనులు, ఈ పనుల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాములవారి దేవాలయ అభివృద్ధి, విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed