కార్మికులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది: మంత్రి హరీష్ రావు ఫైర్

by Satheesh |   ( Updated:2023-11-14 13:18:05.0  )
కార్మికులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది: మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. తెలంగాణ భవన్‌‌లో ఇవాళ నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్‌పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండ్‌ని మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్‌ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని అన్నారు.

కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తామని, అంగన్ వాడీలా సమస్యలు తీర్చుతామన్నారు. కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా సౌకర్యం చేపడుతున్నామని, ఏ కారణం చేతైన ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో 5 లక్షల భీమా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువ అని చెప్పారు. కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ. రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారని ఆరోపించారు. అమ్ముడు తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదని దుయ్యబట్టారు.

తెలంగాణ ఏర్పడగానే బీజేపీ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసిందని, దాంతో సీలేరు విద్యుత్ ప్రాజెక్టు మనకు దక్కకుండా పోయిందన్నారు. తెలంగాణకు బీజేపీ ఇంత అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కేసీఆర్‌ని తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నయని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రెండు ఢిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయని, బీజేపీ పార్లమెంటులో బిల్లు పెడితే కాంగ్రెస్ మద్ధతిస్తుందని చెప్పారు.

మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలతో కొన్ని నెలల్లోనే ఆ రాష్ట్రం దివాలా తీసిందని, మాట తప్పే కాంగ్రెస్ కావాల్నా, మాట మీద నిలబడే కేసీఆర్ కావాల్నా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed