ఎలక్షన్ టీమ్‌ను సిద్ధం చేస్తోన్న KCR సర్కార్.. రంగంలోకి హరీష్ రావు, మహిళా IAS ఆఫీసర్..!

by Satheesh |
ఎలక్షన్ టీమ్‌ను సిద్ధం చేస్తోన్న KCR సర్కార్.. రంగంలోకి హరీష్ రావు, మహిళా IAS ఆఫీసర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కావాల్సిన ఆఫీసర్ల టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తమకు అనుకూలమైన అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించే పనిలో పడింది. ఇందుకోసం మంత్రి హరీశ్ రావు, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ లిస్టును రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు? అతని సొంత జిల్లా ఏది? ఆ ఆఫీసర్ రూలింగ్ పార్టీపై ఎలా ఉంటారు? అనే అంశాలను బేరీజు వేసుకొని జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

బర్త్ డే పక్కన పెట్టి కసరత్తు

శనివారం మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు. సహజంగా ఆయన ప్రతి పుట్టిన రోజున ఫ్యామిలీతో కలిసి గడపడం అలవాటు. కానీ శనివారం మాత్రం మధ్యాహ్నం సెక్రటేరియట్‌కు వచ్చిన హరీశ్ రాత్రి వరకు ఆర్వోల నియామకంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఏ అధికారిని ఎక్కడ నియమించాలో సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌తో చర్చించినట్టు తెలుస్తున్నది.

ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లే కీలకం

ఎన్నికల పక్రియలో రిటర్నింగ్ అధికారులు చాలా కీలకం. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు వారు తీసుకునే నిర్ణయాలకు తిరుగుండదు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం వీరిచ్చే రిపోర్టుల ఆధారంగానే తుది నిర్ణయాలు తీసుకుంటుంది. చివరికి పోలీసులూ రిటర్నింగ్ ఆఫీసర్ల ఆదేశాలను పాటించాల్సిందే. దీంతో రూలింగ్ పార్టీ తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఆర్వోలుగా నియమించుకునేందుకు ఇంట్రస్ట్ చూపుతుంది.

మూడేళ్లుగా ఒకే చోట ఉండి, ఎన్నికల బాధ్యతలు చూసే అధికారులను బదిలీ చేయాలని జులై 31లోపు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలమైన అధికారులను ఆర్వోలుగా అపాయింట్‌మెంట్ చేసే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. వారు రెవెన్యూ శాఖకు రిపోర్టు చేసిన వెంటనే వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.

మాట వినే అధికారులకు ప్రియారిటీ

ప్రస్తుతం ఆర్వో బాధ్యతలు చేసే పోస్టులో ఎవరున్నారు? ఆ ఆఫీసర్ చెప్పిన మాట వింటారా? ఎన్నికల సమయంలో సానుకూలంగా ఉంటారా? లేకపోతే మొండిగా వ్యవహరిస్తారా? అనే విషయాలను ఒకటికి రెండు మూడు సార్లు లెక్కలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఆర్వోలుగా నియమిస్తున్నట్టు తెలుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిన ఆఫీసర్లు ఉంటే వారిని అక్కడి నుంచి తప్పించనుంది. తమకు ఫలానా ఆఫీసర్‌ను ఆర్వోగా నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రికమెండేషన్లకు ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తున్నట్టు సమాచారం.

తహసీల్దార్లకు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. కె.మహేశ్వర్, ఎం.సూర్యప్రకాశ్, మురళీకృష్ణ, కె.మాధవి, పి.నాగరాజు, ఎల్.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్ రెడ్డి, పి.మాధవిదేవి, వి.సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాసరావు, డి.దేవుజ, డి.ప్రేమ్‌రాజ్, ఐవీ భాస్కర్ కుమార్, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ, ఆర్వీ రాధాభాయిలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది.

Advertisement

Next Story