మందుల ధరలు 12 శాతం పెంచడం దారుణం: హరీశ్ రావు

by GSrikanth |
మందుల ధరలు 12 శాతం పెంచడం దారుణం: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘బీజేపీ పాలనతో అచ్చే దిన్​కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్” అని మంత్రి హరీష్ రావు ఫైర్​అయ్యారు. కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు పెంచడంతో గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యగా ఆయన పేర్కొన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందని గుర్తు చేశారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్ధమైందన్నారు. ఇది అత్యంత బాధాకరమని, దుర్మార్గమైన చర్యగా మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇదేనా బీజేపీ చెబుతున్న అమృత్ కాల్..?? దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి” అంటూ మంత్రి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed