దేశంలో తెలంగాణ నంబరు వన్: Harish Rao

by GSrikanth |   ( Updated:2023-08-13 15:51:15.0  )
దేశంలో తెలంగాణ నంబరు వన్: Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీ ఆసుపత్రిలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబరు వన్ స్థానంలో ఉన్నదన్నారు. దేశ ప్రజల వైద్య అవసరాలు తీర్చే శక్తిగా తెలంగాణ ఎదుగుతున్నదన్నారు. 2014లో ఉన్న 2850 ఎంబీబీఎస్ సీట్లను ఇప్పుడు 8515 కు పెంచామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రులలో దాదాపు 3 వేల మంది మన రాష్ట్రానికి చెందిన వైద్యులను నియమించామన్నారు. వైద్య విద్య చదువుతున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం మంచి మార్పునకు నిదర్శనమన్నారు.

ప్రతి లక్షకు 22 ఎంబీబీస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉందని గర్వంగా చెబుతున్నానని చెప్పారు. 8 పీజీ సీట్లతో రెండోస్థానంలో ఉన్నదన్నారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర ఫీజులు తక్కువగా ఉండగా, స్టైఫండ్ ఎక్కువగా ఉన్నదన్నారు. ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్ హెల్త్ సిటీతో కలిపి అటానమస్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఐటీ, వాక్సిన్, ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ అతి కొద్ది రోజుల్లోనే హెల్త్ హబ్ కాబోతున్నదన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు చికిత్స కోసం వేల మంది వస్తున్నారన్నారు. కొద్ది రోజుల్లోనే హెల్త్ హబ్ కాబోతున్నదన్నారు. ఈనెల 16న గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Next Story