దమ్ముంటే ఆ పని చేయాలి.. ప్రధాని మోడీకి MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాల్

by Satheesh |   ( Updated:2023-06-27 11:53:15.0  )
దమ్ముంటే ఆ పని చేయాలి.. ప్రధాని మోడీకి MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని నిన్న ప్రకటన చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. మంగళవారం మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో మతతత్వం పెరిగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు భవనాలు కట్టి ఇస్లామిక్ సెంటర్‌ను మాత్రం ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. పాతబస్తీకి మెట్రో రైలు విస్తరణపై ఆయన నిలదీశారు. ప్రభుత్వం పని చేసినప్పుడు సమర్ధించామని ఇప్పుడు పని చేయడం లేదు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై స్పందిస్తూ కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీని స్వాగతించారు. ఈ పర్యటనతో కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి దమ్ముంటే ఉమ్మడి పౌర స్మృతిని పంజాబ్‌లో అమలు చేయాలని ఛాలెంజ్ చేశారు. మంగళవారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. ఒకే దేశంలో రెండు చట్టాలతో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. యూసీసీ తీసుకురావాలని సుప్రీంకోర్టు పదే పదే చెబుతోందని గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ .. నరేంద్ర మోడీ చెబుతోంది యూనిఫాం సివిల్ కోడ్ గురించి కాదని హిందూ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లిం విధానాలన్ని చట్ట వ్యతిరేకమైనవిగా, హిందు విధానాలన్ని చట్టం కింద రక్షణ కల్పించేలా ప్రధాని మాట్లాడుతున్నారని ఇది సరికాదన్నారు. మణిపూర్ తగలబడిపోతుంటే అక్కడికి వెళ్లని ప్రధాని యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Read More..

KCR పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story