ఎలివేటెడ్ కారిడార్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం తగదు

by Sridhar Babu |
ఎలివేటెడ్ కారిడార్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం తగదు
X

దిశ, తిరుమలగిరి : కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎలివేటెడ్ అంశాలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ రహదారి నాగపూర్ హైవేపై నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన 60 మీటర్ల రహదారి విస్తరణను 40 మీటర్లకు కుదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన స్థానిక హెచ్ఎండీఏ అధికారులు నిష్పక్షపాతంగా బోర్డు అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

అదే విధంగా కంటోన్మెంట్ పరిధిలో మంచినీటి బకాయిలకు సంబంధించి ఈ నెల 15 నుండి డిసెంబర్ 31 వరకు పెండింగ్ లో ఉన్న నీటి బకాయిలను ఒకేసారి చెల్లించేందుకు వెసులుబాటు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. ఈటల రాజేందర్ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. అంతే కాకుండా ఎలివేటెడ్ కారిడార్ లలో భూ బదలాయింపు కింద రక్షణ మంత్రిత్వ శాఖ 24 ఎకరాలు నష్టపోతుందని, అందుకు నష్టపరిహారంగా రూ.303 కోట్లు రక్షణ మంత్రిత్వ శాఖకు జమ చేయాలని ఆయన గుర్తు చేశారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు జరిగాయని, ప్రస్తుతం ఈ అంశంపై స్తబ్దత ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, అధికారులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed