అక్రమ నిర్మాణాల జోరు..అనుమతులు ఒకోలా.. నిర్మాణాలు మరోలా..

by Aamani |
అక్రమ నిర్మాణాల జోరు..అనుమతులు ఒకోలా.. నిర్మాణాలు మరోలా..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిస్థితి. ఈ సర్కిల్ పరిధిలో అక్రమ, అనధికార, అదనపు అంతస్థుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.ఆ భవనాలలో పార్కింగ్ సదుపాయం, సెట్ బ్యాకు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొన్ని సార్లు అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చి హడావిడి చేసి వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మామూళ్ల మత్తులో..

నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేకుండా అక్రమంగా పెద్ద భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ సామాన్యులు, మధ్యతరగతి వారు నిర్మిస్తున్న చిన్న చిన్న నిర్మాణాలపై అల్వాల్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ న్యాయ స్థానం ఆదేశాలు అమలులో ఉన్నా.. అక్రమ నిర్మాణాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి.అడ్డుకోవాల్సిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఎసీపీ,టీపీఎస్, చైన్ మెన్ లు కలెక్షన్లపైనే దృష్టి సారించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు కొంత మంది రాజకీయ నేతలు అండగా నిలుస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సిబ్బంది జంకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

మచ్చుకు కొన్ని..

ఓల్డ్ అల్వాల్ రోడ్డులో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.

-సెయింట్ మైకేల్ స్కూల్ రోడ్డు సాయి బృందావన్ కాలనీ కమాన్ వద్ద రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాన్ని కడుతున్నారు.అదేవిధంగా సెయింట్ మైకేల్ స్కూల్ ఎదురుగా కూడా రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని స్టిల్ -2 కమర్షియల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు.

-మిలటరీ డెయిరీ ఫామ్ రోడ్డులో జూడియో షోరూమ్ పక్కన నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ తవ్వుతున్నారు.

-మిలటరీ డెయిరీ ఫామ్ రోడ్డులో శ్రీ గణేష్ దేవాలయం వద్ద రెసిడెన్షియల్ అనుమతులు తీసుకోని కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.

-ఏడబ్ల్యు హెచ్ ఓ కాలనీ శ్మశాన వాటిక వద్ద రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు.

-పంచశీల్ కాలనీలోని శివాలయం సమీపంలో అనుమతులకు విరుద్దంగా సెల్లార్ తవ్వుతున్నారు.

-యాదమ్మ నగర్ జంక్షన్ లో రోడ్డును ఆక్రమించి భారీ భవనాలను నిర్మిస్తున్నారు.

ఒత్తిళ్లతోనే ఏమి చేయలేకపోతున్నాం..

ఉన్నతాధికారుల ఒత్తిళ్లతోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేకపోతున్నామని టౌన్ ప్లానింగ్ కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. పలుమార్లు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము వెళ్లగా.. అక్కడ ఎందుకు వెళ్లారంటూ పై స్థాయి అధికారి ఒకరు తమను చివాట్లు వేసినట్లు వారు వాపోతున్నారు. సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, తాము ఏమీ చేయలేకపోతున్నామని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి స్పందించి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed