కాంగ్రెస్ రెబల్‌గా సర్వే నామినేషన్

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ రెబల్‌గా సర్వే నామినేషన్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం చివరి రోజున బుధవారం 10 మంది 14 నామినేషన్లు దాఖలు చేశారు.మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, శ్రీ గణేష్ నారాయణన్ లు ఇద్దరు కాంగ్రెస్ తరపున తలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, బహుజన ముక్తి పార్టీ నుంచి యు. ఉపేందర్,శ్రమ జీవి పార్టీ తరపున జాజుల భాస్కర్ లు సైతం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇకపోతే ధర్మ సమాజ్ పార్టీ నుంచి గుండాటి నర్సింగరావు, స్వాతంత్ర్య అభ్యర్థులుగా ఎం.జై రామ్, జీడి మడ్ల రాజ్ కుమార్, జె.నర్సింగరావు, బంగారి రాజులు తమ నామినేషన్ పత్రాలను కంటోన్మెంట్ ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ కు సమర్పించారు.కాగా బుధవారం తో కలిపి కంటోన్మెంట్ లో మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయి.

కాంగ్రెస్ రెబల్ గా సర్వే నామినేషన్ దాఖలు..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ నారాయణ ను ప్రకటించగా, కేంద్ర మాజీ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు.దీంతో కంటోన్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది.నామినేషన్ వేసే ముందు సర్వే సత్యనారాయణ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తనను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడంపై సర్వే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నేను ఒకసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా రెండు సార్లు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని, కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశానని తెలిపారు. తాను మల్కాజిగిరి పార్లమెంట్ తోపాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ను ఆశించానని, తనను కాదని ఇతర పార్టీలు రిజెక్ట్ చేసిన క్యాండిడెట్లకు టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వకుండా గుడ్డి, కుంటి గుర్రాలకు టికెట్ ఇవ్వడమేమిటీ.. సీఎం రేవంత్ రెడ్డికి అనుభవం లేదా..? లేక ఎవరైనా చెప్పుడు మాటలు వింటున్నాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని, ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చేల్లించుకుంటుందన్నారు. హైకమాండ్ లో తనకు గుర్తింపు ఉన్నా.. ఇక్కడి నాయకులు వారి సొంత లాభాల కోసం ఇతరులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దేశం మతతత్వ పార్టీ చేతిలో ఉంది, మూడో సారి అధికారంలోకి వస్తే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా మారుస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు , కార్యకర్తలు నా వెంబడే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని సర్వే హెచ్చరించారు.



Next Story

Most Viewed